మోదీ కేబినెట్లో తెలంగాణకు ప్రయారిటీ!?
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అత్యధిక ప్రాధాన్యత దక్కబోతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. దక్షిణాదిలో తాము అధికారంలోకి వచ్చే అవకాశాలున్న రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే కేబినెట్ విస్తరణలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను చక్కదిద్దే వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బండి సంజయ్‌కు కేబినెట్ ర్యాంకు ఇస్తారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ కేడర్‌లో ఆయనకున్న మాస్ ఇమేజ్, హిందుత్వ ఫైర్‌బ్రాండ్ వాయిస్ పార్టీకి పెద్ద అసెట్. అయితే, ఇటీవలే ఆయన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును అస్త్రంగా చేసుకుని, సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఒత్తిళ్లకు లొంగని ప్రధాని మోదీ, బండి సంజయ్ పట్టును, ప్రజాదరణను గుర్తించి ఆయన పోర్ట్‌ఫోలియోను మరింత పెంచి, కీలకమైన శాఖను కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన బలమైన నేత, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే గాసిప్స్ బలంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ఈ పావు కదుపుతోంది.
ఇవి కూడా చదవండి
ఈటలకు కేబినెట్ హోదా లేదా స్వతంత్ర బాధ్యతలతో కూడిన మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఆయనను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల సాంప్రదాయ బీసీ ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చని బీజేపీ హైకమాండ్ గట్టి నమ్మకంతో ఉంది.
దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, మహిళా కోటా కింద సీనియర్ నాయకురాలు డి.కె. అరుణ పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమెకు కలిసివచ్చే ప్రధానాంశం. మరోవైపు, ఉత్తర తెలంగాణలో ఘాటైన వాయిస్ వినిపించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కూడా ఏదైనా కీలక బాధ్యతల్లోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలుపు ద్వారా నిరూపించుకున్న ఆయన దూకుడు, పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించడానికి ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తోంది.
ప్రస్తుతం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి భవితవ్యంపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయనకు శాఖల మార్పు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. తెలంగాణలో 2028 ఎన్నికల నాటికి బీజేపీని సంస్థాగతంగా అత్యంత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిని పూర్తిగా మంత్రిత్వ శాఖ నుంచి తప్పించి, రాష్ట్ర లేదా జాతీయ స్థాయి పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేస్తారా? లేక ఇంకా అత్యంత కీలకమైన పోర్ట్‌ఫోలియోను అప్పగిస్తారా? అనేది పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ కేబినెట్ విస్తరణ గనుక జరిగితే తెలంగాణ నుంచి కనీసం ముగ్గురు లేదా నలుగురు నేతలకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కే వీలుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరోసారి కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం లేదు. అందుకే వచ్చే ఎన్నికలకు ఇప్పుడే పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమీకరణాలను లెక్కలోకి తీసుకుని మోదీ తన టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా, రాబోయే కేబినెట్ మార్పులు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మైండ్ గేమ్‌ను, ఎన్నికల వ్యూహాన్ని స్పష్టం చేయనున్నాయి. ఢిల్లీ వేదికగా జరగబోయే ఈ పరిణామాలు గల్లీలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి







