ఉప్పల్ లో.. టాప్ ప్లేస్ రేస్..!
ఐపీఎల్ 2026(IPL 2026) లీగ్ దశ చివరికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ, టేబుల్లో టాప్-2 స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉన్న బెంగళూరు, ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా క్వాలిఫైయర్-1 కు చేరుకుంటుంది.
ఒకవేళ ఓడిపోయినా, భారీ మార్జిన్ అంటే దాదాపు 87 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోకుండా ఉంటే టాప్-2 లో నిలుస్తుంది. మరోవైపు 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్, టాప్-2 లోకి దూసుకెళ్లాలంటే ఆర్సీబీపై అసాధారణ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 87 నుండి 89 పరుగుల తేడాతో గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ రన్ రేట్ పరంగా ఆర్సీబీని దాటి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను గమనిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి
ఇరు జట్లు ఇప్పటివరకు 27 సార్లు తలపడగా, సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో, బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి, కాగా ఒక మ్యాచ్ రద్దయింది. ముఖ్యంగా హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 6 సార్లు గెలవగా, బెంగళూరు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించగలిగింది. అయితే ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో (మార్చి 28న) మాత్రం ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్ జరిగే ఉప్పల్ పిచ్ ట్రెండ్ ప్రకారం టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో రాత్రి జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేసుకుని గెలిచింది. ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ ఓడిపోయింది, కానీ ఇప్పుడు కమిన్స్ పునరాగమనంతో పాటు అభిషేక్ శర్మ(Abhishek Sharma), క్లాసెన్, ఇషాన్ కిషన్, మరియు 17 వికెట్లతో దూసుకుపోతున్న ఈషాన్ మలింగలతో ఎస్ఆర్హెచ్ జట్టు ఫుల్ ఫామ్‌లో ఉంది. మరోవైపు ఆర్సీబీలో రజత్ పాటిదార్ తిరిగొస్తుండటంతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది.
ఇవి కూడా చదవండి







