బెట్టింగ్ ఉచ్చులో యువత.. గురి తప్పితే.. ఆస్తులు హారతి!
Betting: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారిలా విస్తరిస్తోంది. కేవలం సరదాగా మొదలై, ఆపై వ్యసనంగా మారి సామాన్యులు, యువకులు తమ కష్టార్జితాన్ని బుకీల పాలూ చేసుకుంటున్నారు.
ఆశతో అప్పులు చేసి..
అప్పుల పాలు: పటమటలంకకు చెందిన ఒక యువకుడు గత 25 మ్యాచ్లలో సుమారు రూ. 5 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. పోయిన డబ్బును రాబట్టుకోవాలనే ఆశతో అప్పులు చేసి మరీ పందేలు కాసి, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ బెట్టింగ్ యాప్ల మోజులో పడి లక్ష రూపాయలకు పైగా నష్టపోయాడు. చివరకు తన ఆటోను కూడా తాకట్టు పెట్టి మరీ పందేలు ఆడుతుండటం గమనార్హం.
ఐడీలు, పాస్వర్డ్లు మారుస్తూ..
గతంలో ఉత్తరాది యాప్ల ద్వారా బెట్టింగ్ జరిగేది. కానీ పోలీసులు నిఘా పెంచడంతో, స్థానిక బుకీలు సొంతంగా బెట్టింగ్ యాప్లను తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఐడీలు, పాస్వర్డ్లు మారుస్తూ ఈ దందా సాగిస్తున్నారు. బెట్టింగ్ సొమ్మును చేరవేసేందుకు బుకీలు అమాయకుల పేరుతో కరెంట్ ఖాతాలను తెరుస్తున్నారు. పది మందికి ఒక ఖాతా చొప్పున కేటాయించి, యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతూ బ్యాంకర్లకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
గోవా, బెంగళూరు వంటి ప్రాంతాలకు మకాం..
బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. క్షణికావేశంలో ఆడే పందేలు కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. యువత ఇలాంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన సూత్రధారులు గోవా, బెంగళూరు వంటి ప్రాంతాలకు మకాం మార్చి ఇక్కడి వారిని నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది.







