లోన్ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా? రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ షాక్..!
లోన్ ఈఎంఐ (EMI) ఒక్కరోజు లేట్ అయితే చాలు.. రికవరీ ఏజెంట్ల ఫోన్ కాల్స్, బెదిరింపులతో సామాన్యులు పడే నరకం అంతా ఇంతా కాదు. కస్టమర్లను బూతులు తిట్టడం, బంధువులకు మెసేజ్‌లు పెట్టడం, ఏకంగా రుణగ్రహీతల మొబైల్ ఫోన్లనే బ్లాక్ చేయడం లాంటి అరాచకాలకు పాల్పడుతున్న ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గట్టి వార్నింగ్ ఇచ్చింది. రికవరీ పేరుతో జరుగుతున్న ఈ సైబర్, మానసిక వేధింపులను అరికట్టేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను తెరపైకి తెచ్చింది.
ఇవి కూడా చదవండి
ఫోన్ లాక్ చేస్తే.. బ్యాంకులకే లాక్!
కొన్ని ఫైనాన్స్ యాప్‌లు, బ్యాంకులు హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్న కస్టమర్లు సకాలంలో ఈఎంఐ కట్టకపోతే వారి మొబైల్ ఫోన్లను రిమోట్‌గా కంట్రోల్ చేస్తూ బ్లాక్ చేస్తున్నాయి. ఈ వికృత చేష్టలపై ఆర్బీఐ (RBI) సీరియస్ అయింది. ఏ రుణానికి సంబంధించిన బకాయిలకైనా సరే, కస్టమర్ మొబైల్ ఫోన్‌ను నిలిపివేయడం గానీ, అందులోని ఫీచర్లను పరిమితం చేయడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని తేల్చి చెప్పింది. ఒకవేళ కస్టమర్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ కొనడానికే (మొబైల్ ఫైనాన్స్) లోన్ తీసుకుని ఉంటే.. అది కూడా వరుసగా 90 రోజులు దాటి డిఫాల్ట్ అయితే మాత్రమే డివైజ్ ఫీచర్లను నిలిపివేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అలా ఫీచర్లు నిలిపివేసినా సరే.. ప్రాథమిక అవసరాలైన ఇంటర్నెట్ సదుపాయం, ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ (SOS) సేవలు, ప్రభుత్వ అత్యవసర నోటిఫికేషన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయడానికి వీల్లేదని ఆర్బీఐ (RBI) స్పష్టం చేసింది.
అన్‌లాక్ లేటయితే గంటకు రూ.250 ఫైన్!
ఈ నిబంధనల్లో అత్యంత కీలకమైన అంశం జరిమానా. ఒకవేళ కస్టమర్ తన బకాయిలు చెల్లించినట్లయితే.. చెల్లించిన గంటలోపే ఆ మొబైల్ ఫోన్‌పై ఉన్న ఆంక్షలను బ్యాంకులు తొలగించాలి. ఒకవేళ సాంకేతిక కారణాలు చెబుతూ అన్‌లాక్ చేయడంలో బ్యాంకులు ఆలస్యం చేస్తే.. ఆలస్యమైన ప్రతి గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు ఫైన్ (పరిహారం) చెల్లించాల్సిందేనని ఆర్బీఐ (RBI) పేల్చిన బాంబు ఇప్పుడు డిజిటల్ ఫైనాన్స్ సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
అన్నీ రికార్డ్ అవ్వాల్సిందే!
సోషల్ మీడియా వేదికగా రుణగ్రహీతల వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేసి పరువు తీయడం, వాట్సాప్‌లలో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, పదే పదే కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగడం లాంటివి చేస్తే ఇకపై రికవరీ ఏజెంట్ల ఆటలు సాగవు. బకాయిల వసూళ్ల కోసం కస్టమర్లకు చేసే ప్రతి కాల్‌ను, ఏ సమయంలో చేశారనే వివరాలతో సహా రికార్డ్ చేయడం బ్యాంకులకు ఇకపై తప్పనిసరి. ఏజెంట్లు హద్దు మీరితే వారిపై బ్యాంకులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటాయో ముందుగానే స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆర్బీఐ (RBI) ఆదేశించింది.
‘కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ఈ నెలాఖరు (మే 31) వరకు ప్రజలు, వాటాదారులు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. ఈ కొత్త నిబంధనలను ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి పక్కాగా అమలు చేయాలని ఆర్బీఐ (RBI) లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఏజెంట్ల చేతిలో నలిగిపోతున్న సామాన్యులకు ఒక పెద్ద ఊరట.
ఇవి కూడా చదవండి







