Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన ప్రెసిడెంట్ ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నలుగురు ప్రముఖులను రాజ్యసభకు (Rajyasabha) నామినేట్ చేశారు. ఇందులో సుప్రసిద్ధ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ప్రఖ్యాత చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన అంకితభావం గల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్ ఉన్నారు. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామకాలు జరిగాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ) ప్రకారం, సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ వంటి రంగాలలో విశేష జ్ఞానం, అనుభవం ఉన్న వ్యక్తులను రాజ్యసభకు (Rajyasabha) నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి (President Droupadi Murmu) ఉంది. దీని ప్రకారమే ముర్ము వీరిని నామినేట్ చేశారు.