Chennai: తమిళనాట మళ్లీ ఆధిపత్య పోరు.. ! స్టాలిన్ వర్సెస్ ఆర్ఎన్ రవి..!
ఇటీవలి కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరు సాదారణంగా మారుతోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికార పార్టీకి రాష్ట్ర గవర్నర్లు వత్తాసు పలుకుతుండడం..విపక్ష పాలిత సీఎంలకు ఆగ్రహం కలిగిస్తోంది. అందులో ముఖ్యంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, స్టాలిన్ సర్కార్ మధ్య రాజ్యాంగ పరమైన యుద్ధమే సాగుతోందని చెప్పవచ్చు. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేయడం… మరోసారి వీరిద్దరి మధ్య చిచ్చు రగల్చింది.
లోక్ భవన్ ఏమంటుందంటే..?
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రసంగించాల్సిన గవర్నర్ మధ్యలోనే వెళ్లిపోయారు. సభలో జాతీయ గీతం పాడాలని కోరినా సభాపతి వినిపించుకోలేదని లోక్‌భవన్ వెల్లడించింది. దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందని, స్టాలిన్ సర్కారు మాత్రం ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తోందని పేర్కొంది. దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాలపై గవర్నర్ కార్యాలయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో జాతీయ గీతాన్ని పాడకుండా ప్రభుత్వం అవమానించిందని లోక్ భవన్ విమర్శించింది. ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించిందని, గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్‌ను పదేపదే ఆపివేశారని ఆరోపించింది. అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ సభలో నుంచి వెళ్లిపోయారని తెలిపింది.ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండడంతో ఆ కాపీని చదవడానికి గవర్నర్ నిరాకరించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దారుణాలు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యల గురించి ప్రసంగ కాపీలో ప్రస్తావించలేదని లోక్‌భవన్ తన ప్రకటనలో ఆరోపించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
స్టాలిన్ రియాక్షన్…
అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేయడంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. సభా సాంప్రదాయాన్ని, నైతికతను గవర్నర్ ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వం రూపొందించే ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలన్న నిబంధన ఎక్కడా లేదని స్టాలిన్ గుర్తుచేశారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి ఉద్దేశపూర్వకంగానే సభను అవమానించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం ఎం.కే.స్టాలిన్ మండిపడ్డారు.






