Revanth Reddy: కేసీఆర్ బాటలో సీఎం రేవంత్.. సేమ్ స్ట్రాటజీ వాడేస్తున్నారా..?
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నాటి టీఆర్ఎస్ పటిష్టతకు అప్పటి సీఎం కేసీఆర్ చాలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తమ పార్టీ ఏర్పడిందే టీడీపీ నుంచి కాబట్టి, టీడీపీ ఉనికి లేకుండా చూసుకున్నారు. నయానో, భయానో టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టారు. టీడీపీని తెరమరుగు చేయడం ద్వారా.. టీఆర్ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉండేలా చూసుకోగలిగారు. అయితే.. రాజకీయాలు మారుతూ వచ్చాయి.ప్రస్తుతం కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు.
రేవంత్ రెడ్డికి .. కేసీఆర్ స్ట్రాటజీలపై పక్కాగ అవగాహన ఉంది. 2029 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే.. బీఆర్ఎస్ సమస్యల్లో కొట్టుమిట్టాడాల్సిన అవసరముంది. అంటే ఆ పార్టీని దెబ్బతీయగలగాలి. అందులో ఇప్పటికే కొంతవరకూ సక్సెసయ్యారు కూడా. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ సహా పలు కేసులు కత్తుల్లా బీఆర్ఎస్ నేతల మెడలపై వేలాడుతున్నాయి. అయితే ఇది చాలదు .. ఇంకా చాలా చేయాలన్నది రేవంత్ స్ట్రాటజీగా కనిపిస్తోంది.
అందులో ముఖ్యమైంది బీఆర్ఎస్ ను బలహీన పరచడం. దానికి గతంలో బలంగా ఉండి ఇప్పుడు .. నిస్తేజంగా మారిన పార్టీలను తిరిగి చిగురింపజేయడం.. అందులో భాగంగా ఇప్పటికే కమ్యూనిస్టులకు(LEFT PARTIES) ప్రాధాన్యమిస్తున్నారు. ఆయా పార్టీలతో కలిసి సభల్లో పాల్గొంటున్నారు కూడా. ఇప్పుడు రాష్ట్రంలో ఉనికే కనుమరుగైన టీడీపీని కూడా కాస్త చిగురింప చేస్తే.. బీఆర్ఎస్ లోని కొందరు నేతలు… అటువైపు వెళ్లే అవకాశముంటుంది. ఆమేరకు వారి బలం కాస్త తగ్గితే.. అది వచ్చే ఎన్నికల్లో తమకు మేలు చేస్తుందన్నది రేవంత్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆ స్ట్రాటజీలో భాగంగానే బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చేయాలని సీఎం హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి.. టీడీపీ(TDP) శ్రేణులకు పిలుపునిచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఎదుర్కొంటోంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే అమరావతి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తోంది. ఇదే సందర్భంగా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమ పార్టీ అంటూ పాత అంశాల్ని ప్రస్తావిస్తోంది. మరి.. రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..? బీఆర్ఎస్ వాగ్దాటి గెలుస్తుందా..? వేచి చూడాల్సిందే…!






