Harish Rao: హరీశ్ రావుపై నిఘా.. ఆధారాలు బయటపెట్టిన సిట్..?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీల నేతలు, వ్యాపారవేత్తల చుట్టూ తిరిగిన ఈ విచారణ.. ఇప్పుడు సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం సిట్ (SIT) ముందు హాజరుకావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ విచారణలో సిట్ అధికారులు వెల్లడించిన అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ కావడమే కాకుండా, పార్టీ అంతర్గత నమ్మకాలపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.
సిట్ విచారణలో భాగంగా అధికారులు హరీశ్ రావు ముందు ఉంచిన అంశాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు కేవలం అనుమానితుడు మాత్రమే కాదు, ఒక బాధితుడు కూడా అని సిట్ నిర్ధారించింది. గత ప్రభుత్వ హయాంలో హరీశ్ రావు ఫోన్ కాల్స్‌పై కూడా నిఘా పెట్టారని, ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించారని అధికారులు స్పష్టం చేశారు.
విచిత్రమేమిటంటే, తనపై నిఘా పెట్టారన్న విషయాన్ని హరీశ్ రావు మొదట నమ్మలేదు. “అది సాధ్యం కాదు” అని ఆయన తోసిపుచ్చినప్పటికీ, సిట్ అధికారులు అందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను, రికార్డులను ఆయన ముందుంచినట్లు సమాచారం. సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలో ఇంతటి కీలక పదవిలో ఉన్న తనపైనే నిఘా పెట్టారన్న నిజాన్ని జీర్ణించుకోవడం హరీశ్ రావుకు కష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, వారి సొంత మనుషులపై కూడా నిఘా ఉందనే ఆరోపణలు గతంలోనే వినిపించాయి. సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె కవితే ఈ ఆరోపణలు చేశారు. తనపైన, తన కుటుంబసభ్యుల పైన కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా హరీశ్ రావు ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయనే వార్తలు ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ, సొంత రక్తసంబంధీకులపై కూడా నిఘా పెట్టడం అనేది రాజకీయ నైతికతకే విరుద్ధం అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ కుటుంబం తన సొంత మనుషులను కూడా నమ్మలేదా? లేక పార్టీలో ఎవరైనా తిరుగుబాటు చేస్తారనే భయం వారిని ఈ అడుగు వేయించిందా? అనే చర్చ ఇప్పుడు సామాన్య ప్రజల్లో సైతం మొదలైంది. హరీశ్ రావు వంటి ట్రబుల్ షూటర్, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నేతపై నిఘా పెట్టడం అనేది ఆయన అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు చాలా నిలకడగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తనపై నిఘా పెట్టారన్న అంశాన్ని ఆయన బయటకు ఒప్పుకోకపోయినా, లోలోపల మాత్రం ఈ పరిణామం ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. ఈ ట్యాపింగ్ వెనుక ఎవరి హస్తం ఉంది? అధికారులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం గోప్యతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ విశ్వాసఘాతుకం. ఒకప్పుడు పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న నేతలే నేడు బాధితులుగా నిలబడటం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. హరీశ్ రావు విచారణతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో.. ఇంకా ఎంతమంది ‘సొంత’ మనుషుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.






