Davos: తెలంగాణతో బ్లైజ్ కంపెనీ ఒప్పందం
హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే AI హార్డ్‌వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినాకర్ మునగాలా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి.
ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, ఇంజినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తమ ఆర్ అండ్ డీ సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడం… వచ్చే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యానికి అత్యంత కీలకమని అన్నారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందని అన్నారు. బ్లైజ్ సంస్థ హైదరాబాద్ ఆర్ అండ్ డీ యూనిట్ విస్తరణకు ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఏఐ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇది వ్యూహాత్మక కేంద్రంగా పని చేస్తుందని వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఏఐ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.






