Madhavi Latha: మహిళలే సనాతన ధర్మానికి మూలస్తంభాలు: మాధవీలత కొంపెల్ల
భావితరాలకు ధార్మిక విలువలను అందించడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ప్రముఖ సనాతన ధర్మ పరిరక్షకురాలు మాధవీలత కొంపెల్ల స్పష్టం చేశారు. మహిళలు ఆధ్యాత్మికంగా బలోపేతమైనప్పుడే ధర్మ రక్షణ సాధ్యమవుతుందని ఆమె పిలుపునిచ్చారు.
అమెరికాలోని న్యూజెర్సీలో సాయిదత్త పీఠం, శ్రీశివ విష్ణు దేవాలయం సంయుక్తంగా నిర్వహించిన నారీ శక్తి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. యువతలో సంస్కృతిని పెంపొందించడానికి, సనాతన ధర్మాన్ని కాపాడటానికి మహిళలు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.
ఆలయ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో జరిగిన ఈ సభలో మాధవీలతను వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా సన్మానించారు. అనంతరం కంభమ్మెట్టు శేషగిరిరావు రూపొందించిన సనాతనం శ్వాసగా అనే వీడియోను ఆమె ఆవిష్కరించారు.

గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసాద్ గురుస్వామి, రాణి మాత, సత్య నేమన, కృష్ణ గుడిపాటి, విలాస్ జంబుల తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి కృషి చేశారు.






