Chandrababu: దావోస్ నుంచి డెవలప్మెంట్కు దారి..ఆంధ్రప్రదేశ్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి..
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum ) సమావేశం ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతినిధి బృందం రాష్ట్రానికి తిరిగివచ్చింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ అంతర్జాతీయ సదస్సులో మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka), తెలంగాణ (Telangana), అస్సాం (Assam) వంటి అనేక భారతీయ రాష్ట్రాలు పాల్గొన్నాయి. అయితే, పెట్టుబడుల ఆకర్షణలో ముందంజ వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వ్యూహంతో ఈ వేదికపై తన ఉనికిని బలంగా చాటుకుంది.
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార నాయకులు, సీఈఓలు ,బహుళజాతి సంస్థల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు మరియు ఆవిష్కరణలకు అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఈ సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. అమరావతి (Amaravati)లో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్ట్‌పై టాటా గ్రూప్ (Tata Group) సంస్థలు ఆసక్తి చూపడం ఈ పర్యటనలో లభించిన ముఖ్యమైన ఫలితంగా చెప్పవచ్చు.
అలాగే విశాఖపట్నం (Visakhapatnam)ను అభివృద్ధి చెందుతున్న ఐటీ మరియు ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టే దిశగా రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి పలువురు గ్లోబల్ ప్రతినిధుల ముందు ప్రస్తావించగా, నగరంలోని అవకాశాలపై వారు ఆసక్తి వ్యక్తం చేశారు. మరోవైపు, మంత్రి నారా లోకేష్ వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలతో చురుకైన చర్చలు జరిపి, ఐటీ, డిజిటల్ సేవలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు దారి తీశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,ఆర్ఎంఝెడ్ గ్రూప్ (RMZ Group) కలిసి రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో పది బిలియన్ డాలర్ల పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్న సహకారాన్ని ప్రకటించాయి. ఈ పెట్టుబడులు డిజిటల్, పారిశ్రామిక , మిశ్రమ వినియోగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి. దీని ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని..విశాఖపట్నం ,రాయలసీమ (Rayalaseema) వంటి ప్రాంతాల్లో సమతుల్య వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
క్యాప్‌జెమిని (Capgemini) విశాఖపట్నంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు అంగీకరించింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్, బిపిఎం విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. దేశవ్యాప్తంగా ఏఐ , క్లౌడ్ రెడీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడమే లక్ష్యంగా ఈ సంస్థ ముందుకు వస్తుండటంతో రాష్ట్ర యువతకు నేరుగా లాభం చేకూరనుంది.
అదే విధంగా, బ్లాక్‌స్టోన్ (Blackstone) విశాఖపట్నంలో గ్రేడ్-ఎ ఆఫీస్ స్పేస్‌లు, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులపై ఆసక్తి చూపడం నగర రియల్ ఎస్టేట్ రంగానికి బలాన్నిచ్చింది. విజయవాడ (Vijayawada)లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలన్న టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రతిపాదన కూడా వేలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే, దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ గ్లోబల్ పెట్టుబడి వేదికపై నిలబెట్టింది. అయితే, ఈ చర్చలు ఎంత వేగంగా భూమిపై అమలులోకి వస్తాయనే అంశమే రాబోయే రోజుల్లో ఈ పర్యటన నిజమైన విజయాన్ని నిర్ణయించనుంది.






