Karnataka: కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ సంచలనం.. ప్రభుత్వం ప్రసంగాన్ని పక్కనపెట్టి వాకౌట్
తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనుసరించిన ధోరణిలోనే ఇప్పుడు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కూడా ప్రవర్తించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కొత్త ఏడాదిలో ప్రారంభమైన తొలి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అత్యంత కీలకం. కానీ, ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది.
కేవలం రెండు లైన్లతో ముగింపు
సాధారణంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదవడం ఆనవాయితీ. అయితే, గురువారం సభకు వచ్చిన గవర్నర్ గహ్లోత్ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రతిని పక్కన పెట్టారు. “ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా” అని కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి సభ నుండి వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ప్రసంగంలో ఉండటం పట్ల ఆయన ముందుగానే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం
గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. క్యాబినెట్ నిర్ణయాలను గౌరవించకుండా గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని కాదని, ఆయన సొంతంగా సిద్ధం చేసుకున్న వ్యాఖ్యలు చేయడం చెల్లదని పేర్కొన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.
గవర్నర్ – ప్రభుత్వం మధ్య రాజుకున్న వివాదం
గత రెండేళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాలను యథావిధిగా చదివిన గవర్నర్, ఈసారి వ్యూహాత్మక మార్పు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో గవర్నర్ కార్యాలయం రాజకీయ వేదికగా మారుతోందని వారు విమర్శిస్తున్నారు. ఈ పరిణామంతో కర్ణాటకలో పాలక పక్షం, గవర్నర్ మధ్య ఉన్న సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడులో..
తమిళనాడులో కూడా గవర్నర్, ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ముఖ్యంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన ఘటనలు రాజ్యాంగపరమైన చర్చకు దారితీశాయి.
అసలు వివాదం ఏమిటి?
తమిళనాడు ప్రభుత్వం సిద్ధం చేసిన అధికారిక ప్రసంగ పాఠంలో ‘ద్రవిడ మోడల్’ (Dravidian Model) పాలన గురించి, అలాగే పెరియార్, అన్నాదురై, కామరాజర్ వంటి దిగ్గజ నాయకుల పేర్లు ఉన్నాయి. అయితే, గవర్నర్ ఆర్.ఎన్. రవి తన ప్రసంగం చదివేటప్పుడు ఈ కీలక పదాలను, పేర్లను కావాలనే దాటవేశారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని యథావిధిగా చదవకుండా, తనకు నచ్చిన రీతిలో మార్పులు చేయడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
స్టాలిన్ వ్యూహం – గవర్నర్ వాకౌట్
గవర్నర్ ప్రసంగం ముగియగానే, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఒక సంచలన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. “ప్రభుత్వం సిద్ధం చేసిన ముద్రిత ప్రసంగ పాఠం మాత్రమే సభా రికార్డుల్లోకి వెళ్లాలి తప్ప, గవర్నర్ చదివిన సవరించిన ప్రసంగం కాదు” అని ఆ తీర్మానం సారాంశం. స్టాలిన్ ఈ తీర్మానాన్ని సభలో చదువుతుండగానే, తీవ్ర అసహనానికి గురైన గవర్నర్ ఆర్.ఎన్. రవి జాతీయ గీతం ఆలపించకముందే సభ నుండి బయటకు నడిచి వెళ్ళిపోయారు. ఇది భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన మరియు వివాదాస్పద ఘటనగా నిలిచిపోయింది.
సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వ్యవహారం
ఈ వివాదం కేవలం ప్రసంగంతో ఆగలేదు. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పంపిన బిల్లులను తొక్కి పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుత పరిస్థితి
తమిళనాడులో మొదలైన ఈ ‘ప్రసంగ వివాదం’ క్రమంగా కేరళకు, ఇప్పుడు కర్ణాటకకు పాకింది. రాష్ట్రాల హక్కుల విషయంలో,గవర్నర్ అధికారాల పరిధి విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య ఘర్షణకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది.






