PM Modi: ‘నా బాస్ ఆయనే’.. బీజేపీ కొత్త అధ్యక్షుడిపై మోదీ ప్రశంసల జల్లు!
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా బిహార్‌కు చెందిన నాయకుడు నితిన్ నబీన్ (Nitin Nabin) బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. “పార్టీ నిర్మాణం ప్రకారం నితిన్ నబీన్ నా బాస్. నేను కేవలం ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే” అని వ్యాఖ్యానించారు. నబీన్‌ను ‘మిలీనియల్ లీడర్’గా (Millennial Leader) మోదీ అభివర్ణించారు. రేడియో రోజుల నుంచి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం వరకు సాంకేతిక, సామాజిక మార్పులను దగ్గరుండి చూసిన తరం ఆయనదని, ఆయన అనుభవం, సామర్థ్యాలు పార్టీకి, ఎన్డీయే కూటమికి ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీజేపీ అనేది కేవలం రాజకీయ పార్టీ కాదని, అదొక సంస్కృతి అని, జాతీయవాదమే తమ ఊపిరి అని మోదీ (PM Modi) ఈ వేదికగా పునరుద్ఘాటించారు. కేవలం 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్.. బిహార్‌లోని బంకిపురా నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల్లో సంబరాలు చేసుకున్నారు.






