Supreme Court: కులం పేరుతో దూషిస్తేనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ప్రతి గొడవా కాదు!
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC/ST Atrocities Act) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కోపంతో కేవలం తిట్టినంత మాత్రాన, అది అట్రాసిటీ చట్టం కింద నేరంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. బాధితుడిని కేవలం కులం పేరుతో అవమానించాలనే ఉద్దేశంతో దూషిస్తేనే ఈ చట్టం వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
బిహార్‌కు చెందిన కేశవ్ మహతో అనే వ్యక్తికి, ఎస్సీ వర్గానికి చెందిన మరో వ్యక్తితో గొడవ జరిగింది. దీనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని మహతో పట్నా హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం.. ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లలో నిందితుడు బాధితుడిని కేవలం కులం కారణంగానే అవమానించినట్లు ఆధారాలు లేవని అభిప్రాయపడింది. బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ అయినంత మాత్రాన, వారిపై జరిగే ప్రతి చిన్న గొడవ ఈ చట్టం పరిధిలోకి రాదని కోర్టు (Supreme Court) తెలిపింది. అవమానం కులం ప్రాతిపదికన జరిగిందని నిరూపితమైతేనే కఠిన చర్యలు ఉంటాయని వివరిస్తూ, మహతోకు ఊరటనిచ్చింది.






