Y.S.Viveka: వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) మరో కీలక దశకు అడుగుపెట్టింది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరగలేదని, కుట్రకు సంబంధించిన కీలక అంశాలు బయటకు రాలేదని ఆరోపిస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీత (YS Sunitha) కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఆమె, సీబీఐ (CBI) దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గతంలో సునీత వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు, ముందుగా ట్రయల్ కోర్టు (Trial Court)లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే అక్కడ పూర్తి స్థాయి కాకుండా, పరిమిత అంశాలకే పాక్షిక దర్యాప్తునకు అనుమతి లభించింది. ఈ నిర్ణయం తన అభ్యర్థనలకు భిన్నంగా ఉందని భావించిన సునీత, మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
మంగళవారం ఈ అప్పీల్పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్ (Justice M.M. Sundresh) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తవ్వాలంటే ఇంకా ఎవరెవరిని విచారించాలి? ఎవరిని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది? అనే అంశాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ విషయంపై సమగ్ర సమాచారం అందించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
సునీత తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా (Siddharth Luthra) మాట్లాడుతూ, సుప్రీంకోర్టు సూచనల మేరకు తాము ట్రయల్ కోర్టును ఆశ్రయించామని తెలిపారు. అక్కడ దర్యాప్తు కొనసాగించాల్సిన అనేక అంశాలను తమ పిటిషన్లో ప్రస్తావించినప్పటికీ, వాటిలో ఒక్కదాన్నీ పరిగణలోకి తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము కోరని విషయాల ఆధారంగా, పరిమిత స్థాయిలో మాత్రమే పాక్షిక దర్యాప్తుకు అనుమతించడం సరైన విధానం కాదని ఆయన వాదించారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా జస్టిస్ సుందరేశ్ జోక్యం చేసుకుంటూ, నిజంగా ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమా? అనే విషయంపై సీబీఐ స్పష్టంగా చెప్పాలని కోరారు. ఇంకా విచారణ అవసరమైన అంశాలు, కస్టడీ అవసరమైన వ్యక్తుల వివరాలను తెలియజేస్తే, వాటిని కోర్టు పరిశీలిస్తుందని ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పందించిన సీబీఐ తరఫు న్యాయవాది, దర్యాప్తు అధికారిని సంప్రదించి పూర్తి సమాచారం ఇవ్వడానికి రెండు వారాల సమయం కావాలని అభ్యర్థించారు. ఆ విజ్ఞప్తిని స్వీకరించిన సుప్రీంకోర్టు, కేసు విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామంతో వివేకా హత్య కేసు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.






