Chandrababu: చంద్రబాబు కేసుల ఉపసంహరణపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై గతంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill Development Scam), ఏపీ ఫైబర్ నెట్ స్కాం (AP Fibernet Scam) కేసుల మూసివేత అంశం ఇప్పుడు హైకోర్టు (High Court)లో కీలక చర్చకు దారి తీసింది. ఈ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. కేసుల మూసివేతకు కారణాలను నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఈ వ్యవహారంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు (Vemu Kondalarao) హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుపై నమోదైన కేసులను ప్రభుత్వం ఏకపక్షంగా ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ (Jada Sravan Kumar) వాదనలు వినిపించారు. మంగళవారం జరిగిన విచారణలో ఉభయ పక్షాలు తమ తమ వాదనలను కోర్టు ముందు ఉంచాయి.
గత వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Skill Development Corporation), ఫైబర్ నెట్ ప్రాజెక్టుల్లో భారీ అక్రమాలు జరిగాయని అప్పటి ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసులను మొదట ఏసీబీ (ACB) దర్యాప్తు చేయగా, తర్వాత సీఐడీ (CID)కి బదిలీ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు కావడం, దాదాపు 53 రోజుల పాటు జైలులో ఉండడం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం రేపింది.
అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, తనపై గతంలో నమోదైన కేసుల్లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వాటిని ఉపసంహరించుకుంది. సంబంధిత కార్పొరేషన్ల అధికారులు కూడా కేసులకు మద్దతుగా ఆధారాలు లేవని నివేదికలు సమర్పించడంతో, ఏసీబీ కోర్టు (ACB Court) ఆయా కేసులను కొట్టివేసింది. ఈ పరిణామంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికార దుర్వినియోగంతో పాటు అధికారులను ఒత్తిడి చేసి కేసులను ఉపసంహరించుకున్నారని ఆరోపిస్తోంది. భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే ఈ కేసులను తిరిగి తెరపైకి తీసుకొస్తామని హెచ్చరిస్తోంది.
ఈ నేపధ్యంలో ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ వేము కొండలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఫైనల్ రిపోర్టును పొందేందుకు ప్రయత్నించినా, తాను థర్డ్ పార్టీ కావడంతో ఇవ్వలేమని అక్కడి కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే అధికారం విజయవాడ (Vijayawada)లోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టుకే ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుల ప్రకారం ఏసీబీ కోర్టుకు ఆ పరిధి లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ గంటల వ్యవధిలోనే కేసులను మూసివేయడం చట్టవిరుద్ధమని, సీఆర్పీసీ 164 ప్రకారం ఇచ్చిన వాంగ్మూలాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, కేసుల ఉపసంహరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వమే నివేదికగా సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో చంద్రబాబు కేసుల అంశం మరోసారి న్యాయ, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.






