Nara Lokesh:లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదల కోసం కూటమి ప్రత్యేక ప్రోగ్రామ్..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పుట్టిన రోజు ఈ నెల 23న జరగనుంది. ఈ సందర్భంగా ఆయన 42 ఏళ్లు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. గత సంవత్సరాలకంటే భిన్నంగా, ఈసారి ఆయన పుట్టిన రోజును ప్రజలకు ఉపయోగపడే విధంగా గుర్తుండిపోయేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రాజకీయ వేడుకలకే పరిమితం కాకుండా, పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించనున్నారు.
నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి స్థలాల పట్టాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇది పూర్తిగా అధికారికంగా నిర్వహించే కార్యక్రమం కావడం విశేషం. ఇప్పటివరకు చాలా మంది నిరుపేదలు ప్రభుత్వ భూములపై లేదా పోరంబోకు ప్రాంతాల్లో చిన్నచిన్న గూళ్లు వేసుకుని జీవిస్తున్నారు. అయితే వారు నివసిస్తున్న స్థలాలపై వారికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకపోవడం వల్ల ఎప్పుడూ అనిశ్చితి పరిస్థితుల్లోనే జీవించాల్సి వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో, ముందుగా మంగళగిరి నియోజకవర్గంలో (Mangalagiri Constituency) నారా లోకేష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ చాలాకాలంగా నివసిస్తున్న పేదల గృహాలను క్రమబద్ధీకరించి, వారు ఉంటున్న స్థలాలకే పట్టాలు ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. ఆ నిర్ణయానికి మంచి స్పందన రావడంతో, అదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక నుంచి ఎక్కడో ఒక చోట ఆధారపడుకుని జీవిస్తున్న ఆసరాలేని పేదల గూళ్లు అధికారికంగా గుర్తింపు పొందనున్నాయి. దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయి మార్గదర్శకాలు, అవసరమైన పత్రాలను సిద్ధం చేసింది. గత మూడు నెలలుగా నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా లబ్ధిదారుల వివరాలను సేకరించి, దాదాపు రెండు లక్షల మంది పేదలను అర్హులుగా గుర్తించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వారు నివసిస్తున్న భూమి ప్రభుత్వానికి సంబంధించినదైనా, పోరంబోకు భూమైనా, అక్కడ ఇప్పటికే ఇళ్లు వేసుకుని జీవిస్తున్న వారికి చట్టబద్ధ హక్కులు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ మహత్తర కార్యక్రమానికి జనవరి 23న నారా లోకేష్ పుట్టిన రోజును ముహూర్తంగా నిర్ణయించడం రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అనంతపురం జిల్లా (Anantapur District) మడకశిర నియోజకవర్గంలో (Madakasira Constituency) ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) పాల్గొననున్నారు. తొలి దశలో మడకశిర నియోజకవర్గంలోనే సుమారు పది వేల మంది లబ్ధిదారులకు పట్టాలు అందించనున్నారు. ఆ తరువాత అదే రోజు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియను విస్తృతంగా అమలు చేయనున్నారు.






