Supreme Court: కసబ్ కూడా అలా చేయలేదు.. మేనకా గాంధీపై సుప్రీం సీరియస్!
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును బహిరంగంగా విమర్శించిన మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రదర్శించిన హావభావాలు (Body Language) కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని మండిపడింది.
మేనక తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్.. తాను గతంలో 26/11 ఉగ్రదాడి నిందితుడు అజ్మల్ కసబ్ కేసు కూడా వాదించానని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం.. “కసబ్ కోర్టును ధిక్కరించలేదు, కానీ మీ క్లయింట్ ఆ పని చేశారు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు (Supreme Court) గౌరవాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమెపై ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఇప్పుడు వీధికుక్కల కోసం మాట్లాడుతున్న మేనక.. జంతు సంరక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి, బడ్జెట్ కేటాయింపులకు ఏం చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు కుక్కలకు ఆహారం పెట్టేవారిదే బాధ్యత అని గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సాధారణంగా చేసినవే అయినా.. ప్రజలంతా వింటారు కాబట్టి కోర్టు జాగ్రత్తగా మాట్లాడాలని మరో లాయర్ ప్రశాంత్ భూషణ్ పేర్కొనగా.. ధర్మాసనం దాన్ని ఖండించింది. తాము ఆ వ్యాఖ్యలను సీరియస్‌గానే చేశామని, వీధి కుక్కల దాడులకు ఫీడర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరోసారి తేల్చి చెప్పింది. వాదనల సమయంలో న్యాయవాదితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశామని, కోర్టు వ్యాఖ్యలకు విలువ ఉంటుంది కాబట్టే అంతకుమించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టంచేసింది.






