I-PAC : లేని కంపెనీ నుంచి ఐ-ప్యాక్‌కు రూ.13.5 కోట్ల రుణం… ఎలా..?
రాజకీయ వ్యూహకర్తల ప్రపంచంలో అగ్రగామి సంస్థగా పేరుగాంచిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) ఇప్పుడు ఒక వింతైన ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. ఉనికిలోనే లేని ఒక కంపెనీ నుంచి కోట్లాది రూపాయల రుణం పొందినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదిప్పుడు రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐ-ప్యాక్ సమర్పించిన ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్కు చెందిన ఒక సంస్థ నుంచి రూ. 13.5 కోట్ల భారీ రుణాన్ని సెక్యూరిటీ లేకుండా తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఐ-ప్యాక్ పేర్కొన్న సదరు కంపెనీ ఆ సమయానికి అసలు ఉనికిలోనే లేదు!
ఐ-ప్యాక్ తన ఫైలింగ్స్‌లో రుణదాత పేరును ‘రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అని పేర్కొంది. అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ డేటాబేస్‌లో ఈ పేరుతో ఏ సంస్థా కనిపించడం లేదు. దాదాపు అదే పేరుతో ఉన్న ‘రామ్ సేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ వివరాలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఈ కంపెనీ 2013, డిసెంబర్ 18న రియల్ ఎస్టేట్ కార్యకలాపాల కోసం ఏర్పాటైంది. రెండేళ్ల పాటు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకపోవడం, చట్టబద్ధమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆగస్టు 18, 2018న ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేసింది. కంపెనీ రద్దయిన మూడేళ్ల తర్వాత, అంటే 2021లో ఐ-ప్యాక్ అదే కంపెనీ నుంచి రూ. 13.5 కోట్ల రుణం ఎలా పొందిందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.
ఈ వ్యవహారంలో లోతుగా వెళ్లేకొద్దీ మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఆ కంపెనీకి సంబంధించి ఆన్లైన్లో ఉన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే, అది యమునా నగర్‌కు చెందిన ముఖేష్ అనే వ్యక్తిది అని తేలింది. తనకు ఆ కంపెనీతో కానీ, ఐ-ప్యాక్‌తో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇక కంపెనీ మాజీ షేర్ హోల్డర్లు సైతం తాము ఐ-ప్యాక్‌కు ఎలాంటి రుణం ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్లలో పొరపాట్లు చేయడం సహజం. కానీ, ఉనికిలో లేని సంస్థ నుంచి కోట్ల రూపాయల రుణం చూపడం వెనుక లోతైన కారణాలు ఉండే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలుగా వ్యవహరించే క్రమంలో వచ్చే నిధులను వైట్ మనీగా మార్చుకునేందుకు ఇటువంటి ‘షెల్ కంపెనీల’ ముసుగు వాడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ రుణం పొందిన మాట వాస్తవమైతే, అసలైన రుణదాత పేరును ఎందుకు దాచాల్సి వచ్చింది? రికార్డుల్లో లేని కంపెనీ పేరును ఎందుకు చేర్చారనేది ఆసక్తి రేపుతోంది. ఐ-ప్యాక్ దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పార్టీలతో పని చేస్తోంది. ఈ నిధుల వివాదం ఆయా పార్టీల ప్రతిష్టపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఐ-ప్యాక్ ఇప్పటికే ఈ రుణంలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు తన స్టేట్మెంట్లలో చూపిస్తోంది. లేని కంపెనీకి డబ్బు ఎలా తిరిగి చెల్లిస్తున్నారు? అనే లాజిక్ ఎవరికీ అందని ప్రశ్న. ఇప్పటివరకు ఈ అంశంపై ఐ-ప్యాక్ నుండి అధికారిక వివరణ రాలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దిశగా దృష్టి సారిస్తే.. రాజకీయ నిధుల వెనుక ఉన్న చీకటి కోణాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






