States Vs Governors: రాష్ట్రాలతో గవర్నర్ల పంచాయితీలు..!
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం గవర్నర్ల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్లు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి అధిపతి గవర్నర్. కానీ, అధికారం మాత్రం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు అనుసరిస్తున్న తీరు రాజ్యాంగ సంప్రదాయాలను తుంగలో తొక్కేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు గౌరవం ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ ఏజెంట్లుగా మారుతున్నారా? అనే సందేహాలు కలగక మానవు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) ప్రకారం, ప్రతి ఏటా మొదటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడం ఒక తప్పనిసరి ప్రక్రియ. ఈ ప్రసంగం గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయం కాదు; అది ప్రభుత్వం రూపొందించిన విధాన పత్రం. కానీ, ప్రస్తుత గవర్నర్లు ఈ సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి జాతీయ గీతం అంశాన్ని తెరపైకి తెచ్చి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ‘తమిళ్ తాయి వాల్తు’ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వ హక్కులను ప్రశ్నించడమే అవుతుంది. కేరళ మాజీ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇప్పుడు ప్రసంగంలోని కొన్ని భాగాలను కావాలనే వదిలేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉండకూడదనే నెపంతో ప్రభుత్వం పంపిన స్క్రిప్ట్‌ను ఎడిట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. తాజాగా కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కూడా ఇదే బాట పట్టారు. కేంద్రంపై విమర్శలు ఉన్న భాగాలను దాటవేస్తూ ఆయన ప్రసంగించడం, రాష్ట్ర ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజ్యాంగ పరిషత్ చర్చల్లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గవర్నర్ల పాత్రను చాలా స్పష్టంగా వివరించారు. గవర్నర్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం చాలా పరిమితమని, రాష్ట్ర మంత్రిమండలి సూచనల మేరకే ఆయన నడుచుకోవాలని స్పష్టం చేశారు. బ్రిటిష్ పార్లమెంటరీ విధానంలోని “The King can do no wrong” అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అంటే ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో తప్పులున్నా, ఒప్పిదాలున్నా దానికి బాధ్యత ప్రభుత్వానిదే తప్ప గవర్నర్‌ది కాదు. కాబట్టి, దానిని యథాతథంగా చదవడం గవర్నర్ బాధ్యత. గవర్నర్లు తమకు నచ్చిన పేరాలను చదివి, నచ్చనివి వదిలేయడం వల్ల సభలో జరిగే ధన్యవాద తీర్మానంపై చర్చ అసంపూర్ణంగా మారుతుంది. ప్రభుత్వం ఏయే అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుందో, వాటిని గవర్నర్ అడ్డుకోవడం అంటే పరోక్షంగా ప్రజాతీర్పును అడ్డుకోవడమే.
గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఉండాలి కానీ, రాష్ట్ర ప్రభుత్వాల పనులకు ఆటంకం కలిగించే స్పీడ్ బ్రేకర్ లా మారకూడదు. గవర్నర్లు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా కాకుండా, రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు సైతం గతంలో పలు సందర్భాల్లో గవర్నర్ల పరిధిని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ పడటం వల్ల అభివృద్ధి కుంటుపడటమే కాకుండా, సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నవారు వ్యక్తిగత, రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






