తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో చాటుతున్న ఎన్నారైలు -మైటా బ్రోచర్ ఆవిష్కరణలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
-జూన్ 6న మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేటీఆర్
-కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం రెండేండ్లు వెనక్కి వెళ్లింది
-ప్రజల్లో కేసీఆర్ పాలన లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది
-మైనర్ బాలిక ఘటనపై రాహుల్ ఎందుకు స్పందించరు?
-నిలదీసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
గడిచిన 12, 13 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో ఎన్నారైలు అద్భుతంగా నిలబెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కొనియాడారు. ఇటీవల అమెరికాలోని డల్లాస్ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన ఆవిర్భావ వేడుకలను చూసి, మిగతా దేశాల్లోని తెలంగాణ బిడ్డలు కూడా ఇలాంటి వేడుకలు జరపాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన కౌలాలంపూర్‌లో వైభవంగా నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకలకు సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను గురువారం జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో జగదీశ్‌రెడ్డి, మైటా, బీఆర్ఎస్ మలేషియా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ, విదేశాల్లో తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని విదేశాల్లో విస్తరించడంలో ఎన్నారైలు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పదే పదే గుర్తు చేసుకుంటున్న ఏకైక పేరు కేసీఆర్. తెలంగాణలో డిమాండ్ ఉన్న నాయకులు కేసీఆర్, కేటీఆర్ మాత్రమే. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచమంతా గమనిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ర్టంలో కేసీఆర్ లేని లోటు రెండేండ్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది.

మరిన్ని నగరాల్లో వేడుకలు నిర్వహిస్తాం: మహేశ్ బిగాల
గత ఏడాది అమెరికాలోని డల్లాస్ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించామని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ ప్రెసిడెంట్ మహేశ్ బిగాల గుర్తుచేశారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో మిగతా దేశాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ఘనంగా వేడుకలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మైటా ప్రెసిడెంట్ తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా ప్రెసిడెంట్ చిట్టిబాబు, మైటా ఉమెన్స్‌వింగ్ ప్రతినిధి సుప్రియ, శివ, బీఆర్ఎస్ రాష్ర్ట నాయకులు వంటెద్దు నరసింహరెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, పడాల సతీశ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







