వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు : సీఎం రమేశ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy)పై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి లో రమేశ్ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి (Raja Reddy)పై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు. ఓ కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఎద్దేవా చేశారు. ఓ మైన్ ఓనర్‌ను అంతమొందించి రాజారెడ్డి గనులు దక్కించుకుని ధనవంతుడయ్యారని విమర్శించారు.
పులివెందుల (Pulivendula)లో రాజారెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని చెప్పుకొచ్చారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసునని, ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని, మాజీ మంత్రి వివేకారెడ్డి మరణాన్ని జగన్ వేరేలాగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. వివేకా హత్య కేసులో జగన్ హస్తం ఉందా?, లేదా? అనేది ఓపెన్ పోల్ పెట్టాలని సవాల్ చేశారు. ఈ కేసుతో జగన్‌కి సంబంధం లేదని వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ప్రజలకు జగన్ హత్యా రాజకీయాల గురించి తెలిసిపోయిందని, అందుకే ఆయన ఇప్పుడు తాను మంచివాడిని అని చెబుతున్నారని అన్నారు.







