చంద్రబాబు మాటలకు మంత్రి గండి.. నో వెహికల్ డే పాటించని కొల్లు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఇంధన పొదుపు, ప్రభుత్వ వ్యయాల నియంత్రణపై ప్రజాప్రతినిధులకు ఎన్నో దిశానిర్దేశాలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు మంత్రుల వ్యవహారశైలి ఇప్పుడు సొంత పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు గానూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘నో వెహికల్ డే’ (No Vehicle Day) నిబంధనలను రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) పట్టించుకోకుండా ఉల్లంఘించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
ముఖ్యమంత్రి స్వయంగా పొదుపు మంత్రం జపిస్తున్న తరుణంలో, ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇలా కాన్వాయ్‌తో తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రి కొల్లు రవీంద్ర కర్నూలు జిల్లా నుండి అనంతపురం వరకు ఏకంగా నాలుగు అధికారిక వాహనాల కాన్వాయ్‌తో సుదీర్ఘ ప్రయాణం చేశారు. ‘నో వెహికల్ డే’ రోజున కనీసం తన వాహనాల సంఖ్యను తగ్గించుకోకుండా, ఎప్పటిలాగే భారీ భద్రతా వాహనాలతో పర్యటించడం స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
“ముఖ్యమంత్రి చెప్పిన ఆదర్శ సూత్రాలను కేబినెట్ మంత్రులే పాటించకపోతే ఎలా..?” అంటూ విపక్షాలతో పాటు సాధారణ ప్రజల నుండి కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా గట్టిగా చర్చ నడుస్తోంది. “ప్రభుత్వ పొదుపు నిర్ణయాలు, ఆంక్షలు కేవలం మాటలకే పరిమితమా..?” అంటూ నెటిజన్లు మంత్రి పర్యటనపై ట్రోలింగ్ చేస్తున్నారు. సామాన్యులకు నీతులు చెప్పే నాయకులు, తమ వంతు వచ్చేసరికి విలాసాలను వదులుకోవడానికి ఇష్టపడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొదుపు చర్యలకు మంత్రుల ఇష్టారాజ్య ప్రవర్తనే ఇప్పుడు పెద్ద మైనస్‌గా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.







