వెంకీ కుడుముల కొత్త ప్లాన్ మామూలు కాదు.. ఇట్లు అర్జునతో సైలెంట్ సెన్సేషన్?
డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky kudumula) నిర్మాతగా మారుతూ తెరకెక్కిస్తున్న మొదటి సినిమా ఇట్లు అర్జున(Itlu Arjuna)పై టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనీష్(Aniesh), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ వీడియో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మాటలు లేకపోయినా భావాలు ఎంత బలంగా ప్రేమను వ్యక్తపరచగలవో చూపించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ముఖ్యంగా హీరో మూగవాడిగా కనిపించనున్న పాత్ర సినిమాపై ప్రత్యేకమైన అంచనాలు పెంచుతోంది. డైరెక్టర్ మహేష్ ఉప్పల(Mahesh Uppala) ఈ సినిమాను యాక్షన్ రొమాన్స్ ఎమోషనల్ డ్రామాగా మలుస్తుండగా, కథలోని ఎమోషన్స్ కు సంగీతం ప్రధాన బలంగా నిలవనుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎస్ తమన్(S Thaman) ఎంట్రీని ప్రత్యేకంగా ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన క్రియేటివ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ టెర్రస్‌పై కీబోర్డ్‌తో ట్యూన్ సెట్ చేయడానికి హీరో చేసే సరదా ప్రయత్నాలు, ఆ తర్వాత తమన్ వచ్చి తన స్టైల్లో మ్యూజిక్ మ్యాజిక్ చూపించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మాటలు మాట్లాడలేని హీరో భావాలను సంగీతం ద్వారానే వ్యక్తపరచబోతున్నారనే కాన్సెప్ట్‌ను ఈ ప్రోమో చాలా తెలివిగా హైలైట్ చేసింది. దీంతో ఈ సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కొత్త తరహా ప్రేమకథగా ఆసక్తి రేపుతున్న ఇట్లు అర్జునకు తమన్ సంగీతం తోడవడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. కొత్త హీరో, వినూత్న కథాంశం, ఎమోషన్స్ కు ప్రాధాన్యమిచ్చే టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను యూత్‌కు దగ్గర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ విడుదల కానుండగా, ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా పాజిటివ్ బజ్ పెరుగుతోంది.







