ఐపీఎల్లో హైడ్రామా, హెడ్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వని కోహ్లీ..!
ఐపీఎల్(IPL) లీగ్ దశ ముగింపు మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో పాటు ఆటగాళ్ల మధ్య మైదానంలో హైడ్రామాకు దారితీసింది. భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ, నెట్ రన్ రేట్ ఆధిక్యంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతూ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం (Handshake) చేసుకుంటున్న సమయంలో, ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు(Travis Head) కరచాలనం ఇవ్వకుండానే దాటుకుంటూ వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకోవడానికి మైదానంలోకి వచ్చారు. ఆ సమయంలో ట్రావిస్ హెడ్ తన చేతిని కోహ్లీ వైపు చాచగా, విరాట్ కోహ్లీ అతనిని పూర్తిగా విస్మరిస్తూ నేరుగా దాటుకుంటూ వెళ్లి అవతలి వైపు ఉన్న మిగతా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను పలకరించాడు.
కోహ్లీ ప్రవర్తన చూసి ట్రావిస్ హెడ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ ఆటతీరు, ప్రవర్తనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ మ్యాచ్‌లో 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ తీవ్ర అసహనంతో, ఫ్రస్ట్రేషన్‌తో కనిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 3వ ఓవర్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ వైపు కోహ్లీ కోపంగా చూస్తూ ఏదో సైగలు చేశారు.
హెడ్‌ను ఉద్దేశించి “వచ్చి బౌలింగ్ చెయ్” అని సవాల్ విసరడమే కాకుండా, ఈ సీజన్లో హెడ్ ఎక్కువగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ (Impact Player) గానే వస్తున్నాడనే విషయాన్ని గుర్తుచేస్తూ వ్యంగ్యంగా సైగలు (Teasing gestures) కూడా చేశారు. ఆ తర్వాత కోహ్లీ కేవలం 15 పరుగులకే సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుట్ అయి నిరాశగా పెవిలియన్ చేరాడు. మ్యాచ్ చివర్లో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమైన తరుణంలో ట్రావిస్ హెడ్ బౌలింగ్‌కు వచ్చి రజత్ పాటిదార్ వికెట్ పడగొట్టారు. చివరకు ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసినా మైదానంలో జరిగిన ఆ పాత గొడవను మనసులో ఉంచుకునే కోహ్లీ.. హెడ్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరించినట్లు స్పష్టమవుతోంది.







