ఫ్యాక్షనిజం తెచ్చింది వైఎస్ కుటుంబమే: పయ్యావుల ఫైర్..!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ys Jagan) గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పొంగూరు పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శనివారం మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి, పాలనను అడవి చట్టంగా మార్చేశారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసత్య ప్రచారాలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి మొదటి నుండి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
వైఎస్సార్సీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీ మాత్రమేనని.. రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, నేరమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమేనని మంత్రి కేశవ్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఫ్యాక్షనిజం చరిత్రను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజాన్ని ప్రవేశపెట్టింది, రాజకీయాలను పూర్తిస్థాయిలో నేరమయం చేసింది వైఎస్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఫ్యాక్షనిజంలో గ్రూపులను ప్రోత్సహించడం, గొడవలను రాజేయడం జగన్ తాత రాజారెడ్డితోనే మొదలైందని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ల కాలం నుండి నేటి జగన్ వరకు.. కేవలం ఫ్యాక్షన్ రాజకీయాల ద్వారా పబ్బం గడుపుకోవడం, ప్రత్యర్థులను శారీరకంగా, రాజకీయంగా అణచివేయడమే వీరి నైజమని విమర్శించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో దారుణంగా చంపేసిన చరిత్రను దాచిపెట్టి, ఇప్పుడు నీతులు చెప్పడం జగన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా ఎలా నాశనమైందో ప్రజలందరూ చూశారని మంత్రి కేశవ్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినా.. జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే.. దానిని జీర్ణించుకోలేక జగన్ రోజుకో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే జగన్ ఇలాంటి కుట్రపూరిత ప్రెస్మీట్లు పెడుతున్నారని.. ఆయన చెప్పే అబద్ధాలను నమ్మడానికి ప్రజలు ఇక ఎంతమాత్రం సిద్ధంగా లేరని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.







