నిప్పుల కుంపటిలా ఏపీ.. 48డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
ఏపీలో ఎండలు(Summer Heat), వడగాలులు తీవ్రరూపం దాల్చాయి. భానుడి భగభగలకు రాష్ట్రం మొత్తం నిప్పుల కుంపటిలా మారింది. ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు తోడవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఉన్న 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీలు దాటి నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో(Today Temperature) తూర్పుగోదావరి జిల్లా చిట్యాల మండలంలో అత్యధికంగా 48.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మైదాన ప్రాంతాలతో పాటు కోస్తా తీరప్రాంతాల్లో సైతం ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జన సంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఈ తీవ్రమైన ఎండలు, వడగాలుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది.
ప్రజలంతా ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా గొడుగులు, టోపీలు ధరించాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ (ORS) ద్రావణం, మజ్జిగ, కొబ్బరిబొండాలు మరియు తగినంత మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.







