పశ్చిమాసియా సంక్షోభానికి చరమగీతం…?
ఇరాన్ -అమెరికా మధ్య రెండున్నర నెలలకు పైగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులకు ముగింపు వచ్చేలా కనిపిస్తోంది. నిన్నటి వరకూ తాము చెప్పిందే నెగ్గాలంటూ మంకు పట్టు పట్టిన అమెరికా.. ఇప్పుడు కాస్త తగ్గుతున్న సంకేతాలున్నాయి. మరోవైపు… కుదరదంటే కుదరదన్న ఇరాన్ సైతం క్రమంగా దారికొస్తున్నట్లు సూచనలున్నాయి. దీనికి తోడు మరికొన్ని గంటల్లో శుభవార్త వింటారన్న అమెరికా విదేశాంగమంత్రి రుబియో వ్యాఖ్యలను బట్టి చూస్తే అమెరికా-ఇరాన్ మధ్య సంధి కుదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగింపు చర్చలు వేగవంతమయ్యాయి. ఏ క్షణంలో అయినా ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇరుదేశాలు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం (US-Iran deal)పై చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఇందులో హర్మూజ్ (Strait of Hormuz)ను 60 రోజులపాటు తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడం వంటి అంశాలు ఉన్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించడానికి ఇరాన్ అంగీకరించినట్లు తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని.. దీంతో ఇరాన్ సైతం స్వేచ్ఛగా ప్రపంచ దేశాలకు చమురును విక్రయించుకోగలదని పేర్కొంది.
ఈ ముసాయిదా ఒప్పందంలో అమెరికా దాని మిత్ర దేశాలు ఇరాన్‌పై దాడి చేయకూడదని.. దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికాపై గానీ, దాని మిత్రదేశాలపై గానీ ఎలాంటి ముందస్తు దాడులు చేయకూడదనే ప్రతిపాదన ఉన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఖతార్ బ్యాంకుల్లో స్తంభింపజేసిన 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.55 వేల కోట్లు) టెహ్రాన్ ఆస్తులను విడుదల చేసేందుకు ట్రంప్ యంత్రాంగం అంగీకరించినట్లు తెలిపింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ కూడా అంశం కూడా ఈ ఒప్పందంలో ఉన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరుదేశాల మధ్య తుది ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ను మోహరించి ఉన్న తమ దళాలు వెనక్కు వెళ్తాయని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి







