టార్గెట్ ట్రంప్.. వైట్ హౌస్ కాల్పులు..!
అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉన్నట్టుండి ఓ ఆగంతకుడు.. రివాల్వర్ తో సీక్రెట్ సర్వీసెస్ చెక్ పాయింట్ దగ్గర కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్‌హౌస్ కాంప్లెక్స్ ను లాక్డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో నిందితుడికి సమీపంలో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితుడిపై కాల్పుల తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతాబలగాలు పూర్తిగా తనిఖీ చేశాయి. అంతా సద్దుమణగడంతో 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు.
నేనే ఏసుక్రీస్తు.. నిందితుడి మానసిక స్థితి బాగాలేదు…!
ఈ ఘటనకు కారణమైన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌస్ వద్ద హంగామా సృష్టించిన నేరాల కింద రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అధ్యక్ష భవనం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటం వల్ల తరుచుగా అధికారులు ఇతడిని గమనించేవారని నివేదికలు చెబుతున్నాయి. అరెస్ట్ సమయంలో తానే ఏసు క్రీస్తు అవతారమని, కావాలనే పోలీసులకు చిక్కానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ పరిసరాల్లోకి రావద్దని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ వాటిని అతను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
మే 24న వైట్ హౌస్ వెలుపల ఉన్న 17 స్ట్రీట్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. దీని తర్వాత అతను తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అధికారులు జరిపిన కాల్పుల్లో నసీర్ బెస్ట్ మరణించాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ చెప్పారు.
కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు వైట్‌హౌస్ వద్ద భారీగా మోహరించాయి. శ్వేతసౌధం సమీపంలో 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో ఘటన జరిగింది. కాల్పుల ఘటనను ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీక్రెట్ సర్వీసెస్ అధికారులకు ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి







