హైదరాబాద్ తాగునీటి కష్టాలకు చెక్.. రూ. 10,907 కోట్లతో జలమండలి సరికొత్త మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం కోటిన్నర మంది జనాభా దాహార్తిని తీర్చడానికి జలమండలి ప్రతిరోజూ శ్రమిస్తోంది. ఒకప్పుడు కేవలం 165 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న నీటి సరఫరా పరిధి, ఇప్పుడు దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న తాగునీటి డిమాండ్‌కు, సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాబోయే 2050 వ సంవత్సరం నాటి జనాభా అవసరాలను తట్టుకునేందుకు జలమండలి ఏకంగా 10,907 కోట్ల రూపాయల భారీ వ్యయంతో సరికొత్త ప్రాజెక్టుల ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా రాబోయే రెండేళ్లలో నగరానికి అదనంగా 309 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) తాగునీరు అందుబాటులోకి రానుంది. ఈ వివరాలను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేకంగా వెల్లడించారు.
పెరుగుతున్న జనాభా తాగునీటి డిమాండ్ అంచనాలు
మహానగరంలో రాబోయే కాలంలో తాగునీటి అవసరాలు ఏ స్థాయిలో పెరగనున్నాయో జలమండలి ఒక కచ్చితమైన నివేదికను విడుదల చేసింది.
2025-26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగర జనాభా 1.30 కోట్లుగా ఉండగా, తాగునీటి డిమాండ్ 813.28 ఎంజీడీలుగా ఉంది. కానీ ప్రస్తుత సరఫరా కేవలం 560 ఎంజీడీలు మాత్రమే కావడం వల్ల 253.28 ఎంజీడీల కొరత ఎదురవుతోంది.
2027: జనాభా 1.51 కోట్లకు చేరినప్పుడు డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుంది. అయితే కొత్త ప్రాజెక్టుల వల్ల సరఫరా 869 ఎంజీడీలకు పెరిగి, 34 ఎంజీడీల మిగులు ఉంటుంది.
2030: జనాభా 1.60 కోట్లకు చేరుకున్నా 869 ఎంజీడీల సరఫరాతో నీటి కొరత లేకుండా మేనేజ్ చేయవచ్చు.
2050: ఈ ఏడాది నాటికి నగర జనాభా 2.08 కోట్లకు చేరుకుంటుంది. అప్పుడు తాగునీటి డిమాండ్ ఏకంగా 1114.02 ఎంజీడీలకు (రెండింతలు) పెరుగుతుందని, సరఫరా 1041 ఎంజీడీల వరకు చేసినా 71 ఎంజీడీల స్వల్ప కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
రూ. 10,907 కోట్లతో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు ఇవే
నగర ప్రజల దాహం తీర్చడానికి జలమండలి భారీ వ్యయంతో పలు కీలక ప్రాజెక్టులను ఖరారు చేసింది:
గోదావరి ఫేజ్-2 (ఖర్చు రూ. 6374 కోట్లు): ఎల్లంపల్లి జలాశయం నుండి అదనంగా 195 ఎంజీడీల నీటిని నగరానికి తరలించడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
సుంకిశాల ఇన్ టేక్ వెల్ (ఖర్చు రూ. 2214.76 కోట్లు): నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ నుండి బ్యాక్ వాటర్ పంపింగ్ చేయడం కోసం దీనిని నిర్మిస్తున్నారు.
గోదావరి ఫేజ్-3 (ఖర్చు రూ. 986 కోట్లు): మరో 90 ఎంజీడీల నీటిని అదనంగా నగరానికి తరలించడానికి దీనిని ప్రతిపాదించారు.
మంజీరా రిపేర్లు (ఖర్చు రూ. 722 కోట్లు): మంజీరా లైన్ల ద్వారా అదనంగా నీటిని తరలించేందుకు వీలుగా పాత పైప్లైన్లకు మరమ్మతులు చేపడతారు.
సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ (ఖర్చు రూ. 600 కోట్లు): నగరంలో పాత వాటర్ నెట్వర్క్ మార్చడం, స్మార్ట్ మీటర్లు అమర్చడం వంటి పనులను దీని ద్వారా చేస్తారు.
మిషన్ భగీరథ (ఖర్చు రూ. 10.95 కోట్లు): ఓఆర్ఆర్ (ORR) లోపల ఉన్న 190 గ్రామాలకు కొత్తగా తాగునీటి కనెక్షన్లు ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తారు.
భవిష్యత్తు ప్రణాళికలు కోర్ సిటీ మాస్టర్ ప్లాన్
నగరంలో ప్రస్తుతం 14.5 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, కోర్ ఏరియా కూడా చేరితే మరో 2 లక్షల కొత్త కనెక్షన్లు రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి, మంజీరా జంట జలాశయాల నుండి నగరానికి నీరు అందుతోంది. భవిష్యత్తు అవసరాల కోసం కోర్ సిటీని దృష్టిలో ఉంచుకుని ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఇందులో భాగంగానే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా 4 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గోదావరి ఫేజ్-2 లో భాగంగా ఖాన్ పూర్ వరకు రా వాటర్ లైన్, ట్రీటెడ్ వాటర్ లైన్ వేసి కోకపేట్ సమీపంలోని నియాపోలిస్ వద్ద నిర్మిస్తున్న భారీ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేయనున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిఘా
వేసవి తీవ్రత దృష్ట్యా నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రతిరోజూ 1200 ట్యాంకర్ల ద్వారా 12 వేల ట్రిప్పుల నీటిని జలమండలి అందిస్తోంది. నగరంలోని 94 ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా ఈ సరఫరా జరుగుతోంది. వెస్ట్ జోన్ పరిధిలోని 15 ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్లకు అత్యధిక డిమాండ్ ఉంది. అయితే ఇళ్లలో ఇంకుడు గుంతలు లేని వారు ట్యాంకర్లు బుక్ చేసుకుంటే వారికి రెండింతల ధర వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే గోషామహల్ నుండి దారుస్సలాం, ఇంబీబన్ మూసీ వరకు ఒక భారీ సీవరేజ్ ట్రంక్ మెయిన్ లైన్ నిర్మిస్తున్నారు.
బషీర్‌బాగ్ నుండి నారాయణగూడ టన్నెల్ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. దివ్యశక్తి అపార్ట్మెంట్ నుండి హుస్సేన్‌సాగర్ వరకు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కొత్తగా సీవరేజ్ లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే 2031 వ సంవత్సరం వరకు నగర విస్తీర్ణం ఎంత పెరిగినా తాగునీటి సమస్య ఉండదని జలమండలి ధీమా వ్యక్తం చేస్తోంది.







