ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈడీ నోటీసుల వ్యవహారంపై విజయవాడ(Vijayawada) టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తన సతీమణి కేశినేని జానకీ లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన వార్తా సంస్థలలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అదంతా ముమ్మాటికీ అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. ఈ నోటీసులు రాష్ట్రంలో జరిగినట్లు చెబుతున్న లిక్కర్ స్కామ్‌కు సంబంధించినవి కావని, కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలకు సంబంధించినవని ఆయన స్పష్టం చేశారు.
ఈ వివాదంపై ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni) మాట్లాడుతూ.. ఈడీ నోటీసులు తన భార్యకు వ్యక్తిగతంగా రాలేదని, తాము భాగస్వాములుగా ఉన్న కంపెనీకి మాత్రమే వచ్చాయని తేల్చి చెప్పారు. ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) సంస్థలో తన సతీమణి ఒక డైరెక్టర్‌గా ఉన్న కారణంగానే ఈ నోటీసులు వచ్చాయని వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక సైట్‌ను డెవలప్ చేయడం కోసం ‘ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’ (PRYDE Infracon LLP) అనే సంస్థను ఏర్పాటు చేశామని, దానికి సంబంధించిన లావాదేవీలపైనే ఈడీ ఆరా తీస్తోందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రచారంలో ఉన్న రాజ్ కేసీరెడ్డితో తనకు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని ఎంపీ వివరించారు. గతంలో (2020-21 మధ్య కాలంలో) తాము కలిసి ఒక ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నామని, ఆ సైట్ డెవలప్మెంట్లో భాగంగానే దాదాపు రూ. 35 లక్షల ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పారు. రాజ్ కేసీరెడ్డితో గతంలో రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపార సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈడీ నోటీసులు పంపిందని, అందులో భాగంగానే తమ కంపెనీకి కూడా నోటీసు వచ్చిందని చిన్ని స్పష్టం చేశారు.
రాజ్ కేసీరెడ్డితో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు లేవని వివరించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఎంపీ కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ జారీ చేసిన నోటీసులకు ఈనెల 27వ తేదీన తమ కంపెనీ ప్రతినిధులు చట్టప్రకారం పూర్తి వివరాలతో లిఖితపూర్వక సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే కొందరు పనిగట్టుకుని తన భార్య పేరును లిక్కర్ స్కామ్‌లోకి లాగుతూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి







