ఏపీలో ఎంఎస్ఎంఈ విప్లవం, మెటా, అమెజాన్‌తో కీలక ఒప్పందాలు..!
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త విప్లవానికి నాంది పలికింది. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యుర్’ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 (MSME Growth Summit 2026) కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమ్మిట్ వేదికగా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా సీఎం చంద్రబాబు పలు సంచలన నిర్ణయాలు ప్రకటించడంతో పాటు సరికొత్త పారిశ్రామిక విధానాలకు శ్రీకారం చుట్టారు.
ఇవి కూడా చదవండి
ఈ గ్రోత్ సమ్మిట్ నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 38 సరికొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్లగ్-అండ్-ప్లే (Plug-and-Play) పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించే అద్భుతమైన లక్ష్యంతో ఈ పార్కులను డిజైన్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మొదటి మరియు రెండవ దశల్లో భాగంగా 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని విజయవంతంగా ప్రారంభించింది.
ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన మెటా (Meta), అమెజాన్ (Amazon), జోహో (Zoho) లాంటి సంస్థలతో కీలకమైన అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా స్థానిక ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ మరియు అత్యాధునిక సాంకేతిక సాయం అందనుంది.
పల్లెల్లో వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను సపోర్ట్ చేసే విధంగా ‘రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్’ (RuTAG Smart Village Center Extension) కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని చిన్న పారిశ్రామికవేత్తలకు మరింత ఆర్థిక ఊరటనిస్తూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.200 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల (Common Facility Centres) ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి







