టెస్ట్ క్రికెట్ లో ఐసీసీ సంచలన మార్పులు..!
ఐసీసీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. సాధారణంగా పగటిపూట జరిగే టెస్ట్ మ్యాచ్‌ల సమయంలో మబ్బులు పట్టినా లేదా సాయంత్రం వేళ వెలుతురు తగ్గినా.. బ్యాడ్ లైట్ కారణంగా.. ఆటను నిలిపివేయడం మనకు తెలిసిందే. అయితే, ఇకపై అలా ఆటను ఆపకుండా.. సాంప్రదాయ ఎరుపు రంగు బంతి (Red Ball) స్థానంలో గులాబీ రంగు బంతిని (Pink Ball) మార్చి మ్యాచ్‌ను కొనసాగించాలని ఐసీసీ(ICC) ప్రతిపాదించింది. ప్లడ్‌లైట్ల వెలుతురులో ఎరుపు బంతి సరిగ్గా కనిపించదు కాబట్టి.. ఆటగాళ్లకు మరియు ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ బంతి మార్పిడికి ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారం ఖచ్చితంగా అవసరం. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ రూపొందించిన ఈ సరికొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు. కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే కాకుండా వన్డేలు, టీ20లలోనూ కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. వన్డే మ్యాచ్‌ల మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇకపై హెడ్ కోచ్‌లు నేరుగా మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడి వ్యూహాలు రచించే అవకాశాన్ని కల్పించనున్నారు.
అలాగే, టీ20 మ్యాచ్‌లు మరింత వేగంగా ముగిసేలా రెండు ఇన్నింగ్స్‌ల మధ్య ఉండే బ్రేక్ సమయాన్ని 20 నిమిషాల నుండి 15 నిమిషాలకు తగ్గించబోతున్నారు. వీటన్నిటితో పాటు ఆటలో పారదర్శకతను పెంచేందుకు ఐసీసీ టెక్నాలజీని మరింతగా వాడుకోనుంది. బౌలర్లు ఎవరైనా తప్పుడు పద్ధతిలో బౌలింగ్ (Illegal Bowling Action) చేస్తుంటే, దానిని లైవ్ మ్యాచ్‌లోనే పట్టుకోవడానికి ఆన్-ఫీల్డ్ అంపైర్లకు ‘హాక్-ఐ’ (Hawk-Eye) టెక్నాలజీ యాక్సెస్‌ను ఇవ్వనున్నారు. దీనివల్ల వివాదాస్పద బౌలింగ్ యాక్షన్లను రియల్ టైమ్‌లోనే గుర్తించి కట్టడి చేయవచ్చు. ఈ ప్రతిపాదనలన్నింటినీ ఈ నెల 30న అహ్మదాబాద్‌లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో పరిశీలించి, తుది ఆమోదం తెలపనున్నారు.
ఇవి కూడా చదవండి







