Jay Shah: ఐసీసీ కంటే ఏ జట్టూ గొప్ప కాదు.. బంగ్లా, పాక్ తీరుపై జై షా సీరియస్
భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ముందు కొన్ని దేశాలు వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా (Jay Shah) తీవ్రస్థాయిలో స్పందించారు. భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడం, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ బెదిరింపులకు దిగడం లాంటి పరిణామాలపై ఆయన మౌనం వీడారు. ముంబైలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. “ఐసీసీ చైర్మన్‌గా నేను స్పష్టంగా చెబుతున్నా.. ఐసీసీ కంటే ఏ జట్టూ గొప్పది కాదు. ఒకే ఒక జట్టుతో ఈ సంస్థ నిర్మితం కాలేదు. ఐసీసీ అంటేనే అన్ని జట్ల కలయిక” అని కుండబద్దలు కొట్టారు. బెదిరింపులకు దిగే క్రికెట్ బోర్డులకు ఇది గట్టి హెచ్చరిక అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూయర్షిప్లో సరికొత్త చరిత్ర
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ సాధించిన అద్భుత విజయాలను ఆయన (Jay Shah) ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ మెగా టోర్నీ వ్యూయర్షిప్లో పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని, ఒకేసారి 7.2 మిలియన్ల (72 లక్షల) మంది వీక్షించడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే పసికూనలుగా బరిలోకి దిగిన అసోసియేట్ జట్లు అగ్రశ్రేణి జట్లకు చెమటలు పట్టించిన తీరును ఆయన ప్రశంసించారు. “బలమైన భారత జట్టుకు అమెరికా గట్టి పోటీ ఇచ్చింది. పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ టెన్షన్ పెట్టింది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే ఏకంగా సంచలన విజయం సాధించగా, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను నేపాల్ భయపెట్టింది” అని జై షా (Jay Shah) టోర్నీ తీరును విశ్లేషించారు.
సూర్య, గంభీర్‌లకు దిశానిర్దేశం
ఇదే వేదికగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జై షా (Jay Shah) ఓ విలువైన సూచన చేశారు. “కింది స్థాయి నుంచి పైకి ఎదగడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది, కానీ అగ్రస్థానం నుంచి కింద పడిపోవడానికి కొన్ని నెలలు మాత్రమే పడుతుంది. కాబట్టి కష్టపడుతూనే ఉండండి, మరిన్ని విజయాలు సాధించండి” అని మోటివేట్ చేశారు. తాను బీసీసీఐలో ఉన్నప్పుడే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వరకు ప్రణాళికలు సిద్ధం చేశానని, ఇప్పుడు భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2030, 2031, 2036 ఈవెంట్ల కోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని సూచించారు.







