ట్రావిస్ హెడ్ భార్యపై దారుణ ట్రోలింగ్..!
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ తీవ్ర వివాదానికి దారితీసింది. మైదానంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(Travis Head), టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మధ్య జరిగిన ఆన్-ఫీల్డ్ గొడవ కాస్తా సోషల్ మీడియాలో ముదిరి పాకాన పడింది. ఈ వివాదం నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ (Jessica Davies) ను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు దిగడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కోహ్లీని మరింత వేగంగా ఆడాలంటూ హెడ్ చేసిన వ్యాఖ్యలకు, కోహ్లీ వ్యంగ్యంగా స్పందిస్తూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్న నిన్ను నువ్వే బౌలింగ్‌కు రమ్మంటూ సవాల్ విసిరాడు. ఆ తర్వాత కోహ్లీ 15 పరుగులకే అవుట్ కావడం, మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం జరిగిపోయాయి.
అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం (Handshake) చేసుకుంటున్న సమయంలో.. హెడ్ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచినప్పటికీ, కోహ్లీ అతనిని పూర్తిగా విస్మరించి ముందుకు వెళ్ళిపోయాడు. ఈ వీడియో నెట్లో వైరల్‌గా మారడంతో వివాదం ఊపందుకుంది.
ఇవి కూడా చదవండి
ఈ హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత కొంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ట్రావిస్ హెడ్, అతని భార్య జెస్సికా ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై పడ్డారు. వారి వివాహ ఫొటోల కింద అత్యంత నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు.
ఈ సైబర్ వేధింపులపై ఆస్ట్రేలియా మీడియా సంస్థ ‘ది అడ్వర్టైజర్’ (The Advertiser) తో జెస్సికా మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. “సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలన్నీ వికృతమైన నోటిఫికేషన్లతో నిండిపోయాయి. మేము బానే ఉన్నాం కానీ, ఆన్లైన్ ట్రోలర్స్ నా స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా వదలకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దాడులు, బెదిరింపులకు దిగుతున్నారు. క్రీడల్లో ఆవేశం, అభిమానం ఉండటం సహజమే.. కానీ ఆట వెనుక నిజమైన వ్యక్తులు, వారి కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకనైనా సోషల్ మీడియాలో ఒకరిపట్ల ఒకరు గౌరవంగా, మానవత్వంతో ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.” అని పోస్ట్ చేసింది.
గతంలో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా గెలిచినప్పుడు, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సమయంలోనూ ఇదే తరహాలో భారత క్రికెట్ ఫ్యాన్స్ జెస్సికాను, వారి చిన్న కుమార్తెను కూడా దారుణంగా ట్రోల్ చేశారని ఆమె గుర్తుచేశారు. క్రీడా స్ఫూర్తిని మరచి ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబాలను రోడ్డుకు లాగడంపై క్రీడా విశ్లేషకులు, సామాన్య క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి వికృత చేష్టల వల్ల అంతర్జాతీయంగా భారత క్రికెట్ ఫ్యాన్ బేస్‌కు చెడ్డపేరు వస్తోందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి







