వాహనదారులకు ‘వాహన్’ తిప్పలు.. సాంకేతిక లోపాలతో దళారుల రాజ్యం
Vahan Portal:రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా డిజిటల్ సేవలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్రీకృత ‘వాహన్’ పోర్టల్ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ సేవలు సకాలంలో అందకపోవడంతో సామాన్యులు విసిగిపోతున్నారు. ఇదే తరుణాన్ని ఆసరాగా చేసుకుని దళారులు (ఏజెంట్లు) వేలల్లో డబ్బులు తీసుకుంటూ సామాన్యులను దోచుకుంటున్నారు.
మరింత సంక్లిష్టంగా మారిన సేవలు..
లర్నింగ్ లైసెన్స్ (LLR), డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ (రెక్టిఫికేషన్/రిన్యూవల్), చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్ వంటి విభిన్న రకాల సేవల కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల ఈ విధానంలోకి మారినప్పటికీ, అప్పటి నుంచి సాంకేతిక లోపాలు నిత్యకృత్యంగా మారాయి.
గతంలో నిమిషాల్లో పూర్తయ్యే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ, ఇప్పుడు అరగంట దాటినా కావడం లేదు. ఎల్ఎల్ఆర్ దరఖాస్తుకు మొబైల్ నంబర్ ఆథెంటికేషన్ కావడం లేదు. సరైన సైజులో ఫోటోలు, సంతకం, ఇతర ధ్రువపత్రాలను అప్లోడ్ చేసినప్పటికీ వెబ్సైట్లో లోపాలు తలెత్తుతున్నాయి.
దళారులదే రాజ్యం..
సొంతంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే వెబ్సైట్ పనిచేయకపోవడం, అదే రవాణా కార్యాలయాల్లోని ఏజెంట్లను ఆశ్రయిస్తే వెంటనే స్లాట్ బుకింగ్ అయిపోతుండటం గమనార్హం. వెబ్సైట్లో ప్రతి సేవకు ఒక నిర్దిష్టమైన ప్రభుత్వ రుసుము ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దళారులు చెప్పిందే వేదంగా మారుతోంది. ఆన్లైన్ ఫీజుతో సంబంధం లేకుండా ఒక్కో సేవకు ఒక్కో రకమైన ధర నిర్ణయించి వాహనదారుల నుంచి వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.
బాధితుడి ఆవేదన..
“నా కుమారుడికి లైసెన్స్ కోసం సొంతంగా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కాలేదు. కానీ స్థానిక ఆర్టీఓ ఆఫీసులో ఒక ఏజెంట్‌ను సంప్రదించగానే వెంటనే స్లాట్ బుక్ అయింది. ఇందుకోసం అతనికి రూ. 3 వేలు ఇవ్వాల్సి వచ్చింది. రవాణా శాఖ ఆఫీసుల చుట్టూ తిరగకుండా సొంతంగా చేసుకోవచ్చని చెబుతున్నా, ఆచరణలో మాత్రం దళారులను ఆశ్రయించనిదే పని కావడం లేదు అని”ఆసిఫ్ నగర్‌కు చెందిన ఒక వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల వివరణ..
పోర్టల్‌లో ఎలాంటి సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు పైకి చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జాతీయ సంస్థ ‘ఎన్ఐసీ’ (NIC) నుంచి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటున్నామని, ‘వాహన్’ పోర్టల్‌లో మరిన్ని కొత్త మాడ్యూళ్లను దశలవారీగా ప్రవేశపెడతామని అధికారులు పేర్కొంటున్నారు.







