రూ.30 వేల కోట్ల నిధుల వేట.. చైనా బ్యాంకుల దిశగా హెచ్ఎండీఏ అడుగులు
HMDA: హైదరాబాద్ మహానగరంలో చేపట్టబోయే ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల కొరత రాకుండా చూసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో వివిధ విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్, అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) వంటి ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా హెచ్ఎండీఏ సీఈఓ రవీందర్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి బృందం చైనాలో పర్యటించనుంది. అక్కడ జరుగుతున్న మౌలిక ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు బ్యాంక్ అధికారులతో ఈ బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది.
ఇవి కూడా చదవండి
రూ.30 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు:
మహానగర పరిధిలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రధాన ప్రాజెక్టులలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఉత్తర తెలంగాణ వైపు ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) రావిర్యాల నుండి ఆమన్ గల్ వరకు ‘ఫ్యూచర్’ సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారి, బుద్వేల్ ORR నుంచి మరో రేడియల్ రోడ్డు, ఈసీఐఎల్ (ECIL) నుంచి శీలా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్-3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టులన్నింటికీ సకాలంలో నిధులు సేకరించేందుకు గాను ఇప్పటికే సీటీబీ (CDB), బ్యాంక్ ఆఫ్ చైనా వంటి సంస్థలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తక్కువ వడ్డీ..
సాధారణంగా దేశీయ బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు 10 శాతానికి పైగానే ఉంటాయి. కానీ, ఏఐఐబీ (AIIB) వంటి అంతర్జాతీయ రుణ సంస్థల్లో కేవలం 4 శాతం వరకే వడ్డీ ఉండటంతో పాటు, రుణం తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలపరిమితి లభిస్తుంది. ఈ ప్రయోజనాల వల్లే హెచ్ఎండీఏ విదేశీ రుణాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో చైనా బ్యాంకుల నుంచి రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆ ఫైల్ ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఏఐఐబీ వంటి మల్టీ లాటరల్ బ్యాంకుల వైపు హెచ్ఎండీఏ మొగ్గు చూపుతోంది. ఏఐఐబీ బ్యాంక్ చైనాకు చెందినదే అయినప్పటికీ, అందులో దాదాపు 100 దేశాలకు సభ్యత్వం ఉన్నందున.. ఈసారి కేంద్ర ప్రభుత్వం నుండి సులువుగా అనుమతులు (పచ్చజెండా) లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.







