లోన్ల వడ్డీ భారం తగ్గాలంటే.. క్రెడిట్ స్కోర్ ఎంతుండాలో తెలుసా?
సొంత ఇల్లు, కారు అనేవి సగటు మధ్యతరగతి కుటుంబాల కలలు. వీటిని నిజం చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సాధారణం. అయితే, రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రూపంలో పడే భారాన్ని తగ్గించుకోవాలంటే క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవడం ఒక్కటే మార్గం. ఆర్థికంగా మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో ఈ స్కోరే చెబుతుంది. మీ స్కోరు 800 దాటితే, బ్యాంకుల దృష్టిలో మీరు అత్యంత నమ్మకమైన కస్టమర్‌గా మారుతారు.
గృహ, కారు రుణాలపై స్కోరు ప్రభావం
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు క్రెడిట్ స్కోరు ఆధారంగానే వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల కాలపరిమితితో 50 లక్షల రూపాయల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. మీ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, 7.25 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. దీనివల్ల నెలవారీ ఈఎంఐ 39,519 రూపాయలుగా ఉంటుంది. అదే మీ స్కోరు 750 నుండి 799 మధ్య ఉంటే వడ్డీ రేటు 7.35 శాతం నుండి 7.50 శాతానికి పెరుగుతుంది. ఒకవేళ స్కోరు 700 నుండి 749 మధ్య ఉంటే వడ్డీ 7.60 శాతం నుండి 7.80 శాతానికి చేరుతుంది. స్కోరు 650 కంటే తక్కువగా ఉంటే వడ్డీ రేటు ఏకంగా 8.40 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడుతుంది. దీనివల్ల నెలవారీ ఈఎంఐ 43,075 రూపాయలకు చేరుతుంది. అంటే, తక్కువ స్కోరు ఉండటం వల్ల నెలకు రూ. 3,550 చొప్పున 20 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 8.5 లక్షల రూపాయలు అదనంగా బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది.
కారు రుణాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. సాధారణంగా కారు రుణాలపై వడ్డీ రేట్లు 8.70 శాతం నుండి 9.85 శాతం వరకు ఉంటాయి. మీ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే అత్యల్పంగా 8.70 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. అదే స్కోరు 700 కంటే తక్కువగా ఉంటే 9.65 శాతం నుండి 9.85 శాతం వరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. దీనివల్ల కారు కొనుగోలు ఖర్చు భారీగా పెరిగిపోతుంది.
క్రెడిట్ స్కోరును 800 పైన ఉంచుకోవడానికి చిట్కాలు
మీ స్కోరు ఎప్పుడూ తగ్గకుండా ఉండాలంటే దైనందిన జీవితంలో కింది ఆర్థిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి.
సకాలంలో బిల్లుల చెల్లింపు: లోన్ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తేదీ లోపే చెల్లించాలి. సాంకేతిక సమస్యల వల్ల ఒక్కరోజు ఆలస్యమైనా స్కోరు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడూ ఆటో-డెబిట్ సదుపాయం పెట్టుకోవడం ఉత్తమం.
కార్డు పరిమితి వాడకం (క్రెడిట్ యుటిలైజేషన్): మీ క్రెడిట్ కార్డు పరిమితి 1 లక్ష రూపాయలు అనుకుంటే, అందులో కేవలం 30 శాతం అంటే 30 వేల రూపాయల లోపు మాత్రమే వాడాలి. ప్రతి నెలా పూర్తి పరిమితిని వాడేస్తుంటే, మీరు అప్పులపై ఎక్కువగా ఆధారపడే వ్యక్తిగా బ్యాంకులు భావించి మీ స్కోరును తగ్గిస్తాయి.
కనీస మొత్తం చెల్లింపుల మోసం: క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు చాలా మంది కేవలం ‘మినిమం డ్యూ’ (కనీస మొత్తం) కట్టి సరిపెట్టుకుంటారు. దీనివల్ల లేట్ ఫీజు పడకపోయినా, మిగిలిన బ్యాలెన్స్ మొత్తంపై ఏడాదికి 30-50 శాతం వరకు చక్రవడ్డీ పడుతుంది. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా, స్కోరును దారుణంగా దెబ్బతీస్తుంది.
అనవసర దరఖాస్తులు వద్దు: అవసరం ఉన్నా లేకపోయినా ఆన్లైన్ యాప్‌లలో లేదా కనిపించిన ప్రతి బ్యాంకులోనూ క్రెడిట్ కార్డు లేదా లోన్ కోసం దరఖాస్తు చేయకూడదు. మీరు అప్లై చేసిన ప్రతిసారీ బ్యాంకులు మీ క్రెడిట్ నివేదికను పరిశీలిస్తాయి (హార్డ్ ఎంక్వైరీ). ఇవి పెరిగే కొద్దీ మీ స్కోరు పడిపోతుంది.
పాత కార్డులను రద్దు చేయవద్దు: చాలా కాలంగా వాడుతున్న పాత క్రెడిట్ కార్డులను అవసరం లేదని రద్దు చేయకూడదు. ఆ కార్డుల ద్వారా మీ క్రెడిట్ చరిత్ర ఎంత పాతదైతే, మీ స్కోరు అంత బలంగా ఉంటుంది.
‘సెటిల్మెంట్’ జోలికి వెళ్లొద్దు: అప్పులు తీర్చలేక, బ్యాంకు వాళ్లతో మాట్లాడి కొంత మొత్తం చెల్లించి ఖాతాను ముగించడాన్ని ‘సెటిల్మెంట్’ అంటారు. ఇది మీ క్రెడిట్ రిపోర్టులో ప్రతికూలంగా నమోదవుతుంది. భవిష్యత్తులో మీకు ఎక్కడా రుణాలు దొరకకుండా చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పూర్తి మొత్తాన్ని చెల్లించడానికే ప్రయత్నించండి.
ఉచితంగా తనిఖీ చేసుకోండి: మీ పేరు మీద లేదా పాన్ నంబరు మీద ఎవరైనా మోసపూరితంగా రుణాలు తీసుకున్నారేమో క్రమంగా తనిఖీ చేసుకోవాలి. ఎన్పీసీఐ భీమ్ యాప్‌లో లేదా ట్రాన్స్‌యూనియన్ సిబిల్ భాగస్వామ్యంతో మీ క్రెడిట్ స్కోరును ఉచితంగా తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంది.
క్రెడిట్ స్కోరు అనేది ఒక రోజులో పెరిగేది కాదు. క్రమం తప్పని ఆర్థిక క్రమశిక్షణతో మాత్రమే దాన్ని 800 పైన ఉంచగలము. ఈ స్కోరును జాగ్రత్తగా కాపాడుకుంటే, తక్కువ వడ్డీకే రుణాలు లభించి మీ కష్టార్జితం లక్షల రూపాయల మేర పొదుపు అవుతుంది.







