పెళ్లి పత్రికల పేరుతో సైబర్ మోసాలు.. క్లిక్ చేసారో అకౌంట్ ఖాళీ!
Cyber Crime: నగరంలో పెళ్లి పిలుపుల పేరుతో కొత్త రకం సైబర్ మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఐటీ ఉద్యోగి వాట్సాప్‌కు వివాహ ఆహ్వానం పేరుతో ఒక లింక్ వచ్చింది. అందులోని సమాచారం చూడాలంటే ‘ఏపీకే’ (APK) ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన దాన్ని డౌన్లోడ్ చేయగానే ఫోన్ హ్యాక్ అయింది. క్షణాల వ్యవధిలో ఆయన ఖాతా నుంచి రూ. లక్షన్నర మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మాల్వేర్ ద్వారా..
సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా ‘మ్యారేజ్ ఇన్విటేషన్.apk’ లేదా ‘వెడ్డింగ్ కార్డ్.apk’ వంటి లింకులను పంపుతుంటారు. కొన్నిసార్లు మనకు తెలిసిన బంధువులు, స్నేహితుల నంబర్ల నుంచే ఇవి వచ్చినట్లు భ్రమ కల్పిస్తారు. పెళ్లి పత్రికే కదా అని ఆసక్తితో ఆ లింక్ క్లిక్ చేయగానే, ఒక అప్లికేషన్ ఫోన్ లో డౌన్లోడ్ అవుతుంది. అందులో ఉండే ‘మాల్వేర్’ (వైరస్) ద్వారా ఫోన్ లోని వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్స్, ఫోటోలు, ఎస్ఎమ్ఎస్లు అన్నీ సైబర్ మాయగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. వీటి ఆధారంగా వారు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సందేశాల రూపంలో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. నిజమైన పెళ్లి పత్రికలు ఎప్పుడైనా పీడీఎఫ్ (PDF) లేదా జేపీఈజీ (JPEG) రూపంలో ఉంటాయి. .apk అని వచ్చిందంటే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. బంధుమిత్రుల నంబర్ల నుంచి ఇలాంటి ఫైల్స్ వస్తే, వెంటనే వారికి ఫోన్ చేసి అది వారే పంపించారా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఏవైనా యాప్స్ కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, మంచి యాంటీవైరస్ యాప్స్‌ను ఉపయోగించాలి.
ఒకవేళ డౌన్లోడ్ చేస్తే ఏం చేయాలి?
తెలియక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తే, వెంటనే ఫోన్ ఇంటర్నెట్ (మొబైల్ డేటా/వైఫై) ఆఫ్ చేయాలి. అనుమానాస్పద యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేయాలి. వెంటనే మీ బ్యాంక్ పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను మార్చేసి, బ్యాంకు లావాదేవీలను పరిశీలించుకోవాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్’ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలి.
పోలీసుల హెచ్చరిక:
“పెళ్లి శుభలేఖలు, ఉచితంగా కొత్త సినిమాలు చూసేయండి అంటూ వచ్చే అనుమానాస్పద లింకుల పట్ల ప్రజలు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఈ లింకుల వెనుక దాగున్న మాల్వేర్ ప్రమాదాన్ని గుర్తించి, అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకూడదు.”
ఇవి కూడా చదవండి







