అమెరికా గ్రీన్‌కార్డు నిబంధనల్లో భారీ మార్పులు.. తాత్కాలిక వలసదారులు ఇకపై స్వదేశం నుంచే దరఖాస్తు చేయాలి!
అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటూ గ్రీన్‌కార్డు సాధించాలని కలలుగంటున్న విదేశీయులకు యూఎస్సీఐఎస్(USCIS) సంచలన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ, గ్రీన్‌కార్డు ప్రక్రియ చివరి దశలో ఉన్న అభ్యర్థులు అమెరికా లోపల ఉండి ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’ (AOS) చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మినహా, మిగిలిన వారంతా తమ సొంత దేశాలకు వెళ్లి అక్కడ ఉన్న యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయాల ద్వారానే (Consular Processing) గ్రీన్‌కార్డు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల యూఎస్సీఐఎస్ ఒక కొత్త పాలసీ మెమోను విడుదల చేసింది.
లోపాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం
ఈ చారిత్రక మార్పుపై యూఎస్సీఐఎస్ అధికారిక ప్రతినిధి జాక్ కహ్లర్ మాట్లాడుతూ, వలస చట్టాల అసలు ఉద్దేశాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, లేదా టూరిస్ట్ వీసాలపై వచ్చేవారు ఒక నిర్దిష్ట కారణంతో స్వల్పకాలం కోసం అమెరికాకు వస్తారని, వారి పర్యటన ముగియగానే దేశాన్ని వీడి వెళ్లడమే చట్టబద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలను గ్రీన్‌కార్డు ప్రక్రియకు తొలి అడుగుగా మార్చుకోకూడదని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత కూడా చాలా మంది అమెరికాలోనే అక్రమంగా ఉండిపోతున్నారని, కొత్త విధానం వల్ల అలాంటి వారిని గుర్తించి వెళ్లగొట్టాల్సిన అవసరం ఏజెన్సీకి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారుల విచక్షణపైనే నిర్ణయం
కొత్త నిబంధనల ప్రకారం ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’ను ఒక అసాధారణ ఉపశమనంగా మాత్రమే పరిగణిస్తారు. అమెరికాలోనే ఉండి హోదా మార్పు కోరడానికి ఎలాంటి పరిస్థితులను ‘అసాధారణమైనవి’గా పరిగణిస్తారనే దానికి స్పష్టమైన జాబితా ఏదీ మెమోలో ఇవ్వలేదు. ప్రతి అప్లికేషన్‌ను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తారు. అభ్యర్థి అన్ని చట్టపరమైన అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, అమెరికాలోనే ఎందుకు ఉండాలో నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా దరఖాస్తుదారుడిపైనే ఉంటుంది. తాత్కాలిక వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోయిన వారి అభ్యర్థనలను అధికారులు తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రాక్టికల్ ఇంపాక్ట్..
ఈ కొత్త విధానం వల్ల హెచ్-1బీ హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తుంది. అయితే, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఇది వర్తిస్తుందా లేదా అనే దానిపై యూఎస్సీఐఎస్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఈ కఠిన చర్యల ఫలితంగా అమెరికాలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981 దరఖాస్తులు రాగా, కొత్త విధానాల ప్రభావంతో 2027 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య ఏకంగా 38.5 శాతం తగ్గి 2,11,600 కి పరిమితమైంది. ఇకపై ఉన్నత డిగ్రీలు, అత్యధిక వేతనాలు ఉన్న అభ్యర్థులకే వీసాల ఆమోదంలో పెద్దపీట వేయనున్నట్లు వలస సేవల సంస్థ వెల్లడించింది.







