ఫైనల్ లో అడుగుపెట్టేది ఎవరు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) దశ ఉత్కంఠభరితంగా ముగిసిన తర్వాత ఇప్పుడు అసలైన ప్లేఆఫ్స్ సమరం మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు నేడు జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ ప్రతిష్టాత్మక పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. లీగ్ స్టేజ్‌లో రెండు జట్లు కూడా 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించగా, మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ టేబుల్ టాప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2026 లీగ్ దశలో ఈ రెండు జట్లు రెండుసార్లు ముఖాముఖి తలపడగా, ఇరు జట్లు తలా ఒక మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా నిలిచాయి. ఏప్రిల్ 24న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.
అయితే విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఏప్రిల్ 30న అహ్మదాబాద్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్లో ప్రతీకారం తీర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్, శుభ్‌మన్ గిల్(Shubhman Gill) (43), జోస్ బట్లర్ (39) మెరుపులతో 4 వికెట్ల తేడాతో సులువుగా విజయం అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య ఓవరాల్ రికార్డులు పూర్తిగా సమంగా ఉన్నాయి.
ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో ఇరు జట్లు చెరో 4 విజయాలతో సమాన బలాబలాలను ప్రదర్శించాయి. అయితే అందమైన ధర్మశాల మైదానంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇదే మొదటి మ్యాచ్ కావడం గమనార్హం. ఈ పిచ్ సాధారణంగా ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, ఇక్కడ సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం 80 శాతం వరకు ఉందని వాతావరణ నివేదికలు చెబుతుండటంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్‌లో నెలకొంది.
ఇవి కూడా చదవండి







