వేసవి ఎండల్లో శరీరాన్ని చల్లబరిచే సూపర్ ఫుడ్స్ ఇవే
Summer Diet: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం అర్ధరాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడి కాస్త ఉపశమనం లభించినప్పటికీ, ఆదివారం ఉదయం నుంచే భానుడు మళ్లీ భగ్గుమన్నాడు. నగరంలోని మచ్చబొల్లారంలో గరిష్టంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగిలిన ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సోమవారం నుంచి రోహిణీ కార్తె కూడా ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ఆహార అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో జాతీయ పోషకాహార సంస్థ (NIN) కొన్ని కీలక సూచనలు చేసింది.
సహజసిద్ధమైన పానీయాలు..
దాహం వేసినప్పుడు కృత్రిమ చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌ల జోలికి వెళ్లకుండా కొబ్బరినీళ్లు, పలచని మజ్జిగ, నిమ్మరసం, రాగి జావ వంటి ప్రకృతి సిద్ధమైన పానీయాలను తీసుకోవాలి. వేడి కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ తాగడం ఉత్తమం. ఐస్‌క్రీమ్‌లకు ప్రత్యామ్నాయంగా నానబెట్టిన చియా గింజలను తింటే శరీరానికి చలువ చేస్తుంది. రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తాగుతూ, వీలైనంత వరకు నీడపట్టున ఉండాలి.
మసాలాలు తగ్గించి..
వేసవిలో మసాలాలు, వేపుళ్లు (ఫ్రైస్) జీర్ణక్రియను మందగించేలా చేసి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటూ నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయ, సొరకాయ, పొట్లకాయ, ముల్లంగి వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే సలాడ్ల రూపంలో కీర, పండ్లలో పుచ్చకాయ, కర్బూజ వంటి వాటిని వేసవి డైట్లో భాగం చేసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఖచ్చితంగా పెరుగు లేదా మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. ఇది మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను కాపాడటమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
మద్యానికి దూరం..
వేసవి కాలంలో మద్యం ఎక్కువగా తాగితే శరీరం చాలా వేగంగా డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ కాలంలో వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండటం లేదా తగ్గించడం ఎంతో శ్రేయస్కరం.
ఇవి కూడా చదవండి







