సెమీ కండక్టర్ల సామర్థ్యం పెంచే సరికొత్త సాంకేతికత.. విజయవంతంగా ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
TIFRH Scientists: కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, ఎల్ఈడీ దీపాలు వంటి నిత్యజీవిత పరికరాల్లో అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ల విద్యుత్ ప్రవాహ సామర్థ్యాన్ని , పనితీరును భారీగా పెంచే సరికొత్త సాంకేతికతను హైదరాబాద్‌లోని గోపనపల్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR-H) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ పవిత్రా నాయక్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ సరికొత్త విధానాన్ని విజయవంతంగా ఆవిష్కరించింది.
కొత్త విధానం (ERPA)..
సెమీ కండక్టర్లలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి సాధారణంగా ‘ఎలక్ట్రానిక్ డోపింగ్’ అనే పద్ధతిని వాడుతుంటారు. దీనికోసం లోహపు లవణాలు, రసాయనాలను ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల రసాయన అవశేషాలు పరికరాల్లో మిగిలిపోయి, కాలక్రమేణా వాటి పనితీరు మందగించి జీవితకాలం తగ్గిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు ‘ఇన్ సిటు రీజనరేటివ్ అడక్ట్ అసిస్టెడ్’ (ERPA) డోపింగ్ అనే సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
మెరుగైన పనితీరు..
ఈ కొత్త ఈఆర్పీఏ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే నేరుగా స్వీయ పునరుత్పత్తి చెందే క్రియాశీల పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎలాంటి రసాయన వ్యర్థాలు మిగిలిపోవు , పరికరాల పనితీరు ఎంతో మెరుగవుతుంది.
సామర్థ్యం ఏకంగా 24.6 శాతానికి..
అధునాతన సెమీ కండక్టర్ పదార్థమైన ‘హాలైడ్ పెరోవ్‌స్కైట్’ క్రిస్టల్ నిర్మాణంతో కూడిన సోలార్ సెల్స్ ఎక్కువ కాలం మన్నేలా చేయడంలో ఈ సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుంది. ఒక దశాబ్దం క్రితం వరకు పెరోవ్‌స్కైట్ సెల్స్ సామర్థ్యం కేవలం 10 శాతంగానే ఉండేది. కానీ ఈ సరికొత్త ఈఆర్పీఏ సాంకేతికతను ఉపయోగించడం వల్ల వాటి సామర్థ్యం ఏకంగా 24.6 శాతానికి పెరిగినట్లు పరిశోధనల్లో నమోదైంది. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీ రంగంలో మరింత సమర్థవంతమైన, నాణ్యమైన సరికొత్త సాంకేతికతల అభివృద్ధికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి







