సుకుమార్ చెప్పిన ఆ మాట నా మైండ్ లో పడిపోయింది
సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కేవలం టాలెంట్‌తోనే రావని, కనిపిస్తూనే ఉండటం కూడా అంతే ముఖ్యమని డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇచ్చిన సలహా ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. నటుడు శ్రీనందు(Sri Nandu) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ సంఘటన ఇండస్ట్రీలో నెట్వర్కింగ్ ప్రాధాన్యాన్ని హైలైట్ చేసింది. రంగస్థలం(rangasthalam) స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్న సమయంలో ఒక ప్రెస్ మీట్లో కలిసిన సుకుమార్, ఎందుకురా కనిపించడం లేదు? అంటూ మరుసటి రోజు కలవమని చెప్పారట. ఆ తర్వాత జరిగిన సంభాషణ తన కెరీర్ ఆలోచననే మార్చేసిందని నందు వెల్లడించారు.
సుకుమార్ చెప్పిన మాటల్లో ఇండస్ట్రీ రియాలిటీ స్పష్టంగా కనిపించిందని నందు పేర్కొన్నారు. నువ్వేమైనా స్టార్ హీరోవా? అందరూ నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడానికి. మాకు వందల పనులు ఉంటాయి. నీపై మంచి అభిప్రాయం ఉంది, కానీ అప్పుడప్పుడు కనిపిస్తేనే అవకాశాలు గుర్తుకొస్తాయి అని ఆయన చెప్పినట్టు వివరించారు. దర్శకులను, నిర్మాతలను కలుస్తూ ఉండాలని, ఇండస్ట్రీలో మన ఉనికిని గుర్తు చేస్తూ ఉండటం కూడా కెరీర్లో భాగమేనని సుకుమార్ సూచించారట. ఈ సలహా తర్వాతే ప్రమోషన్లు, ఈవెంట్లు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం మొదలుపెట్టానని నందు వెల్లడించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో నటీనటులకు విజిబిలిటీ ఎంత కీలకమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. మంచి నటనతో పాటు, ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్‌ను మెయింటైన్ చేయడం కూడా అవసరమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల అగ్లీ స్టోరీ(Ugly story)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నందు, విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు మాత్రం కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న నటులకు ఒక రియాలిటీ చెక్‌లా మారాయి.







