పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ రెంటల్ విధానం, పర్సెంటేజ్ సిస్టమ్ మధ్య జరుగుతున్న వివాదం రోజురోజుకీ హీట్ పెంచుతోంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు ఒకవైపు, ప్రముఖ నిర్మాతలు మరోవైపు తమ అభిప్రాయాలను బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వివాదానికి పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ ఎగ్జిబిటర్ల ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ను కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు(Suresh Babu) సమక్షంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమస్యను త్వరలోనే పరిష్కరించేలా తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇక మరోవైపు పర్సెంటేజ్ సిస్టమ్‌ను వ్యతిరేకిస్తున్న అగ్ర నిర్మాతలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను కలవనున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ స్థాయిలో జోక్యం అవసరమని భావించిన నిర్మాతలు ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో కొత్త ఆదాయ విధానం అమలైతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొనే సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తూ మధ్యంతర పరిష్కారంపై చర్చలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూలై నుంచి పర్సెంటేజ్ సిస్టమ్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ మార్పులు అమలయ్యే ముందు పెద్ద సినిమాల విడుదలలపై ప్రభావం పడకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది సినిమా విడుదల సాఫీగా సాగేందుకు కూడా చర్చలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు- ఎగ్జిబిటర్లు- ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరుగుతున్న ఈ వరుస భేటీలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్‌కు కీలకంగా మారాయి.







