మోడీకి వీరాభిమానిని.. ట్రంప్ సందేశం..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి భారతప్రధాని మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో చాలా కటువుగా ప్రవర్తించే ట్రంప్.. స్నేహం విషయంలో మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఢిల్లీలో అమెరికా విదేశాంగమంత్రి రుబియో పాల్గొన్న ఓ సమావేశంలో ట్రంప్ అనూహ్యంగా లైవ్ లోకి వచ్చారు. అంతే కాదు.. భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీని తన స్నేహితుడిగా అభివర్ణించిన ట్రంప్, తాను ఆయనకు పెద్ద అభిమానినని అన్నారు.
ఢిల్లీలో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన 250వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న భారీ స్క్రీన్‌పై ట్రంప్ ప్రత్యక్షమై మాట్లాడారు. “ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి. ఆయన నా స్నేహితుడు. భారత్‌తో మా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా, వారు మాకు కాల్ చేయొచ్చు. మా దేశం వంద శాతం అండగా ఉంటుంది” అని ట్రంప్ హామీ ఇచ్చారు.
“భారత్‌కు ఏం కావాలన్నా మేం అందిస్తాం. నేను ప్రధాని మోడీకి చాలా పెద్ద అభిమానిని” అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో ద్వారా ప్రధాని మోడీని వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ట్రంప్ తరఫున ఆహ్వానం కూడా అందింది. మార్కో రూబియో అమెరికా చరిత్రలోనే గొప్ప సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని ట్రంప్ ప్రశంసించారు.
మరోవైపు…అమెరికా తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం, టారిఫ్‌లపై నెలకొన్న ఆందోళనల నడుమ రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్య అసమతుల్యతను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే తమ విధానాలు ఉన్నాయని, ఇది కేవలం భారత్‌ను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా న్యాయమైన వాణిజ్య వ్యవస్థను సృష్టించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి







