మహిళా ఓటుబ్యాంకుపై కన్నేసిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో మహిళా సాధికారత చుట్టూ ప్రస్తుతం సరికొత్త రాజకీయ, ఆర్థిక వ్యూహం నడుస్తోంది. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నప్పటికీ… దీని వెనుక బలమైన మహిళా ఓటు బ్యాంకు రాజకీయం ఉందనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న వరాలు, అమలు చేస్తున్న పథకాలు మహిళలను మహారాణులను చేసేందుకా? లేక రాబోయే ఎన్నికల్లో తిరుగులేని రాజకీయ లబ్ధి కోసమా?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనికోసం ఇప్పటివరకు ఆర్టీసీకి ఏకంగా రూ.10,000 కోట్లు చెల్లించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అనేక అడ్డంకులు, ఆటో కార్మికుల నిరసనలు ఎదురైనా ఈ పథకాన్ని వెనక్కి తీసుకోబోమని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు, మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా, బస్సులకు యజమానులను చేసేలా 1,000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే జూన్ 5న పరేడ్ గ్రౌండ్లో 553 బస్సులను ప్రారంభించబోతున్నారు. మరోవైపు దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకేసారి 8,000 మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో మహిళా శక్తిని బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంఘాలను కేవలం చిన్న కుటీర పరిశ్రమలకే పరిమితం చేయకుండా, కార్పొరేట్ సంస్థల స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. సోలార్ ఎనర్జీ రంగంలో మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహించేలా చర్యలు తీసుకుంటోంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తోంది.
రిలయన్స్ లాంటి సంస్థలు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాలు, రైస్ మిల్లులు, గోడౌన్లు, ప్లాస్టిక్ పార్కుల నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగించేందుకు సిద్ధమైంది. ఈ వ్యాపారాల కోసం 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించనుంది. బ్యాంక్ లింకేజీ లోన్లను రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం. ఇప్పటికే రూ.60,000 కోట్ల రుణాలు అందించగా, సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం రూ.1390 కోట్లు విడుదల చేసింది. డీమార్ట్, బిగ్ బజార్ వంటి కార్పొరేట్ సంస్థలకు దీటుగా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేయనుంది.
గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి పనికొచ్చాయంటూ ఘాటు విమర్శలు చేసిన సీఎం, తాజాగా నాణ్యమైన చిలుక పచ్చ రంగు ఇందిరమ్మ చీరల కొత్త డిజైన్లను విడుదల చేశారు. దీని వెనుక కాంగ్రెస్ సాంప్రదాయక ఇందిరమ్మ రాజ్య సెంటిమెంట్‌ను మహిళల్లో బలంగా నాటాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సొంత చెల్లెలిని ఆస్తి కోసం బయటకు వెళ్లగొట్టే నాయకులు ఉన్న ఈ రోజుల్లో.. రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను తన సొంత సోదరీమణులుగా భావిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక పూర్తిగా భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం కనిపిస్తోంది.
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలా కనిపిస్తున్నప్పటికీ, రాజకీయంగా మహిళా ఓటర్లను శాశ్వతంగా తమ వైపు తిప్పుకునే వ్యూహాత్మక అడుగు. తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళా ఓటర్లు ఏ పార్టీ గెలుపునైనా శాసించగలరు. గత ఎన్నికల్లో మహిళల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఉచిత బస్సులు, సోలార్ ప్లాంట్లు, సున్నా వడ్డీ రుణాలు, నాణ్యమైన ఇందిరమ్మ చీరల ద్వారా ఆ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఆర్థికంగా భారం పడినా వెనక్కి తగ్గకుండా మహిళా పథకాలను ముందుకు తీసుకెళ్లడం వెనుక ఉన్నది కేవలం మహిళా సంక్షేమమేనా, లేక తిరుగులేని రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే మాస్టర్ ప్లానా అనేది కాలమే నిర్ణయించాలి.
ఇవి కూడా చదవండి







