పారేసే మెతుకు.. పేదోడి బతుకు.. వృథా అయ్యే అన్నాన్ని అమృతంగా మార్చుతున్న స్వచ్ఛంద సంస్థలు!
సమాజంలో ఒకవైపు శుభకార్యాల్లో టన్నుల కొద్దీ ఆహారం చెత్తబుట్టల పాలవుతుంటే, మరోవైపు ఒక్క పూట భోజనం కోసం ఎంతో మంది అభాగ్యులు వీధుల్లో అలమటిస్తున్నారు. ఈ రెండు వైరుధ్యాల మధ్య హైదరాబాద్ నగరంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారధిలా నిలుస్తున్నాయి. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే నానుడిని నిజం చేస్తూ, వృథా కావడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని సేకరించి, ఆకలితో ఉన్న పేదల కడుపు నింపుతున్నాయి. శుభకార్యాలు జరిగే చోట ఆహారం మిగిలిందని సమాచారం ఇస్తే, నగరంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నేరుగా వచ్చి ఆయా పదార్థాలను సేకరిస్తున్నాయి. వాటిని రోడ్లపై ఉన్న అనాథలకు, నిరుపేదలకు పంచుతున్నాయి.
ఆహార వృథా సూచిక నివేదిక గణాంకాలు
ఇటీవల వెలువడిన ‘ఆహార వృథా సూచిక-2024’ నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి ఇంట్లో సగటున ఏడాదికి 55 కిలోల ఆహారం వృథా అవుతోంది. జాతీయ స్థాయిలో ఇది సుమారు 7.80 కోట్ల టన్నులుగా ఉంది. పెళ్లిళ్లు, వేడుకలు, హోటళ్లలో వృథా అయ్యేది దీనికి అదనం. ఈ వృథాను అరికట్టడం ద్వారా దేశంలోని ఆకలి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నగరంలో నో ఫుడ్ వేస్ట్, సేవ కిచెన్, రాబిన్ హుడ్ ఆర్మీ, ఫుడ్ బ్యాంక్ ఇండియా, గ్రీన్ బ్లడ్, ఫీడింగ్ ఇండియా వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
ఆకలి తీరుస్తున్న సాంకేతికత స్వచ్ఛంద సేవ
సేకరించిన ఆహారం బాగుందని నిర్ధారించుకున్న తర్వాతే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న అభాగ్యులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ఈ సంస్థలు సోషల్ మీడియా, యాపిల్ యాప్స్ ద్వారా ప్రజలకు చేరువవుతున్నాయి. విందులో ఆహార పదార్థాలు మిగిలితే కేవలం ఒక ఫోన్ కాల్ లేదా వాట్సాప్ సందేశం పంపితే చాలు, వాలంటీర్లు అక్కడకు చేరుకుంటారు. కొన్ని సంస్థలైతే నిరుపయోగంగా ఉన్న ఆహారాన్ని పశుగ్రాసంగా మార్చడం లేదా కంపోస్ట్‌గా మార్చే ప్రక్రియలను కూడా ప్రోత్సహిస్తున్నాయి.
రోజుకు 1500 మంది వరకు ఆకలి తీరుస్తున్నాం
నో ఫుడ్ వేస్ట్ సంస్థ ప్రతినిధి కె. వెంకటమురళి వివరించిన ప్రకారం, ఈ సంస్థను 2018 లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రోజుకు సగటున 1500 మందికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఆహారం తీసుకునే ముందు అన్ని పరీక్షించి తీసుకుంటారు, ఆ ఆహారాన్నే వారి వాలంటీర్లు కూడా భోజనంగా తింటారు. 98660 06269 నంబరుకు సమాచారం ఇస్తే అక్కడకు వాలంటీర్లు తమ వాహనాన్ని తీసుకుని వెళ్లి సేకరించి బాధితులకు ఆహారం అందిస్తారు. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథా చేసే ముందు ఒకసారి ఆలోచించాలని, మిగిలిన అన్నాన్ని ఇలాంటి సంస్థలకు అందిస్తే ఎంతో మంది పేదల ఆకలి తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.







