దేశంలో పాలకు పెరుగుతున్న డిమాండ్.. 300 మిలియన్ టన్నుల ఉత్పత్తే లక్ష్యం!
జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశ పాడి పరిశ్రమ సాధించిన విజయాలతో పాటు మన ముందున్న సవాళ్లపై గోద్రెజ్ ఆగ్రోవెట్ (యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్) సీఈఓ క్యాప్టెన్ (డాక్టర్) ఎ.వై. రాజేంద్ర కీలక విశ్లేషణ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తీవ్ర పాల కొరతను ఎదుర్కొన్న భారత్, ‘శ్వేత విప్లవం’ (వైట్ రెవల్యూషన్) ద్వారా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశంగా అవతరించింది. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా దేశంలో పాలకు, పాల ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌కు సరిపడా సరఫరాను అందించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
1950-51 కాలంలో దేశ వార్షిక పాల ఉత్పత్తి కేవలం 21 మిలియన్ టన్నులు. అప్పట్లో ఒక వ్యక్తికి రోజుకు సగటున కేవలం 124 గ్రాముల పాలు మాత్రమే లభించేవి. ప్రస్తుతం దేశంలో పాల ఉత్పత్తి ఏటా 200 మిలియన్ టన్నులు దాటింది. ఒక వ్యక్తి సగటు పాల వినియోగం కూడా 471 గ్రాములకు చేరింది. ఇది ప్రపంచ సగటు (322 గ్రాములు) కంటే చాలా ఎక్కువ.
ఇవి కూడా చదవండి
మారుతున్న అలవాట్లు..
ఆర్థిక వృద్ధితో పాటు ప్రజలు సాధారణ పాలతో పోలిస్తే పెరుగు, మిల్క్‌షేక్స్, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను (Value-added products) ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటీవల జరిగిన ‘ఇండియా లాక్టోగ్రాఫ్ స్టడీ’ సర్వేలో 58 శాతం మంది ఫ్లేవర్డ్ మిల్క్ వైపే మొగ్గు చూపడం దీనికి నిదర్శనం.
దిగుబడి పెంచడానికి మార్గాలు..
భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక పశువులు ఉన్నప్పటికీ, ఒక్కో పశువు ఇచ్చే సగటు పాల దిగుబడి అంతర్జాతీయంగా చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో పశువు సగటున రోజుకు 7.18 కిలోల పాలు ఇస్తుంటే, మన దేశంలో అది కేవలం 4.87 కిలోలుగానే ఉంది. పశువుల సంఖ్యను పెంచడం కంటే, ఉన్న పశువుల నుంచే ఉత్పాదకతను పెంచేందుకు 3 మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.
పశుగ్రాసం – పోషకాహార కొరత తీర్చడం..
ప్రస్తుతం దేశంలో దాదాపు 70 మిలియన్ టన్నుల పశుగ్రాసం అవసరం ఉండగా, కేవలం 7.5 మిలియన్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. పశువుల జాతి, వాతావరణానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో మేత (Scientific Feeding) అందించడం ద్వారా పాల దిగుబడి పెరగడమే కాకుండా, మిథేన్ వాయు ఉద్గారాలు తగ్గుతాయి.
జన్యుపరమైన మార్పులు (Genetics).
దేశవాళీ ఆవులు రోజుకు 3 నుండి 4.2 కిలోల పాలు ఇస్తుంటే, సంకరజాతి (Crossbred) ఆవులు 8.35 నుండి 8.55 కిలోల వరకు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 73.5 శాతం దేశవాళీ పశువులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’, ‘నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్’ (కృత్రిమ గర్భధారణ) వంటి పథకాల ద్వారా పశువుల జాతులను మెరుగుపరిచే ప్రక్రియ వేగంగా సాగుతోంది.
మెరుగైన పశు సంరక్షణ..
పాకలలో పరిశుభ్రత లోపించడం, ఎండల తీవ్రత (Heat Stress), సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల పాల దిగుబడి తగ్గుతుంది. గాలి, వెలుతురు వచ్చేలా పాకల నిర్మాణం , డిజిటల్ సేవల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందించడం ద్వారా పశువుల పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవచ్చు.
ఈ ప్రపంచ పాల దినోత్సవం కేవలం గత విజయాలను గుర్తుచేసుకోవడానికే కాదు, భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఒక పిలుపు. ప్రభుత్వ విధానాల మద్దతుతో దేశీయ పాల ఉత్పత్తిని 300 మిలియన్ టన్నుల మార్కును దాటించడమే మన ముందున్న తదుపరి ప్రధాన లక్ష్యం.
ఇవి కూడా చదవండి







