గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త విప్లవం.. దేశవ్యాప్తంగా ‘టుమారో మేకర్స్’ కార్యక్రమం షురూ
Godrej Foundation: దేశంలో ప్రతిభ అందరిలోనూ సమానంగా ఉన్నప్పటికీ, అవకాశాలు మాత్రం అందరికీ ఒకేలా దక్కడం లేదు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి, వెనుకబడిన కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఆదుకునేందుకు ‘గోద్రేజ్ ఫౌండేషన్’ ఒక గొప్ప అడుగు వేసింది. 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు గ్రాడ్యుయేట్ల కోసం ‘టుమారో మేకర్స్’ (Tomorrow Makers) అనే జాతీయ స్థాయి ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ వేదిక ద్వారా విద్యార్థులను మెంటార్లు, విద్యాసంస్థలు , పోటీ పరీక్షల కమ్యూనిటీలతో అనుసంధానించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనున్నారు.
నాలుగు రంగాలలో అద్భుత అవకాశాలు..
ఈ కార్యక్రమం కింద వేర్వేరు వయస్సుల విద్యార్థుల కోసం ప్రధానంగా 4 రంగాలలో శిక్షణ , మద్దతును అందిస్తారు.
ఇవి కూడా చదవండి
- స్టెమ్ (STEM): సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.
- ఇన్వెన్షన్ అండ్ మేకింగ్: సరికొత్త ఆవిష్కరణలు, రూపకల్పనలు.
- ఆర్ట్స్ (కళలు): నాటక రంగం, లలిత కళలు.
- డిఫెన్స్ (రక్షణ రంగం): సాయుధ దళాలలో చేరేందుకు శిక్షణ.
ప్రముఖ భాగస్వామ్య సంస్థల ద్వారా సేవలు..
గోద్రేజ్ ఫౌండేషన్ మొత్తం ఎనిమిది స్వచ్ఛంద భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ శిక్షణను ఉచితంగా అందిస్తోంది.
‘దక్షణా’,అవంతిఫెలోస్ సంస్థల ద్వారా అర్హులైన విద్యార్థులకు ఉచితంగా జేఈఈ (JEE), నీట్ (NEET) శిక్షణ లభిస్తుంది.
‘జెన్వైజ్’, ‘మేకర్ఘాట్’ సంస్థలు రోబోటిక్స్, కంప్యూటింగ్, గణిత రంగాలలో అధునాతన కోర్సులను అందిస్తాయి.
‘స్లామ్ అవుట్ లౌడ్’, ‘డ్రామా స్కూల్ ముంబై’ సంస్థలు నైపుణ్యాభివృద్ధి , వృత్తిపరమైన నాటక రంగానికి సంబంధించిన శిక్షణ ఇస్తాయి.
సాయుధ దళాల్లో చేరాలనుకునే గ్రాడ్యుయేట్ల కోసం ‘డెల్టా స్క్వాడ్ ఫౌండేషన్’, ‘యువతేజస్’ సంస్థల ద్వారా రక్షణ రంగ పరీక్షలకు గైడెన్స్ ఇస్తారు. ఈ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ లీడర్షిప్ నేర్పేందుకు విపత్తు సహాయక చర్యల్లో కూడా భాగస్వాములను చేస్తారు.
ఎంపిక ప్రక్రియ..
ఈ ప్లాట్‌ఫారమ్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రతి ఏటా ఎంపికయ్యే విద్యార్థుల బృందంలో (Cohort) 80 శాతం సీట్లను తక్కువ ఆదాయం ఉన్న పేద కుటుంబాల పిల్లలకే కేటాయిస్తారు. అర్హులైన వారికి స్కాలర్షిప్లు కూడా అందజేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి ఒక ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. 6, 7 తరగతుల పిల్లల కోసం తెలుగు, ఇంగ్లీష్, హిందీతో సహా 11 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. 11, 12 తరగతుల వారికి మాత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
ఆసక్తి గల విద్యార్థులు +91 8655979118 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని పంపడం ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ https://www.tomorrow-makers.in/ ను సందర్శించి సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి







